జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ఏడాదిన్నర కింద కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌజ్‌లు నీటమునిగి బాహుబలి మోటార్లన్నీ ఖరాబైనయ్. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లో ప్రొటెక్షన్ వాల్ కూలి ఆరు మోటార్లు తుక్కుకింద మారినయ్. దీనిపై సర్కారు పెద్దల్లో ఏ ఒక్కరూ ఇప్పటివరకు మాట్లాడలే! అప్పట్లో భారీ వరదల పేరు చెప్పి ఇంజినీర్లు తప్పించుకున్నారు. ఈ నెల 21న మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లో పిల్లర్లు భూమిలోకి కుంగినయ్. గేట్లు దెబ్బతిన్నయ్. రోడ్డుపై రాకపోకలు బంద్ అయినయ్. ఎప్పట్లాగే మరోసారి సర్కారు పెద్దలు సైలెన్స్ అయ్యారు.
విద్రోహ చర్య అయి ఉంటుందేమో అని మొదట కంప్లయింట్ ఇచ్చిన ఇంజినీర్లు, తాజాగా పిల్లర్ కింద ఇసుక కొట్టుకపోవడం వల్లే కుంగి ఉంటుందని ప్రెస్‌మీట్‌పెట్టి చెప్పారు. అయితే, తన మేధస్సును మొత్తం ఉపయోగించి, ప్లాన్లు వేసి, డిజైన్లు గీసి కాళేశ్వరం కట్టించానని ఇన్నాళ్లూ గొప్పగా చెప్పుకున్న సీఎం కేసీఆర్ మాత్రం పెదవి విప్పడం లేదు. కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సర్కారును ఇరుకునపెడ్తున్నా ఆయన మౌనం వీడడం లేదు.
గురువారం మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించిన కేసీఆర్.. ఏ ఒక్కచోటా కాళేశ్వరం ప్రస్తావన తేలేదు. కాళేశ్వరం వైఫల్యాలపై బాధ్యత వహించేందుకు ముందుకు రాని సీఎం, బాధ్యులైన ఇంజినీర్లపై చర్యలు కూడా తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రారంభం నుంచి బయటపడ్తున్న లోపాలు..
- జూన్ 21, 2019న సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్ట్‌లో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
- 2019 ఆగస్టులో లక్ష్మీపూర్ పంప్‌హౌజ్ వద్ద ప్రొటెక్షన్ వాల్ లీకైంది. తర్వాత 2019 సెప్టెంబర్3న కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోనూ ప్రొటెక్షన్ వాల్ దెబ్బతినడంతో నీళ్లు లీకై మోటార్లపై పడి ఖరాబయ్యాయి. 2వ మోటార్‌ను ఆన్ చేయగా గేట్‌వాల్వ్ లీకై నీరు ఆకాశం వైపు ఎగజిమ్మింది. ఈ నీరు వరదనీటితో జత కలిసి పంపు హౌస్ లోకి చొచ్చుకొచ్చాయి. మూడో టీఎంసీ ఎత్తిపోతల కోసం జరుపుతున్న పనుల సందర్భంగా ప్రొటెక్షన్ వాల్ దెబ్బతినడం వల్ల ఈ ఘటన జరిగిందని ఇంజినీర్లు చెప్పారు. ఈ ఘటనలో రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
- అక్టోబర్ 9, 2019న అన్నారం బ్యారేజీ గేట్లు లీకయ్యాయి. కాంట్రాక్టర్ చేసిన నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందని నాడు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడంతో గేట్లకు రిపేర్లు చేయించారు.
- 23 ఆగస్టు, 2020న కొద్దిపాటి వర్షాలకే కాళేశ్వరం దగ్గర గ్రావిటీ కెనాల్ లైనింగ్ కూలింది. ఓపెనింగ్ దగ్గర పడుతుండటంతో కాంట్రాక్టర్ హడావిడిగా పనులు చేయడం వల్ల ఇలా జరిగిందని ఆఫీసర్లు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.
- జూలై 23, 2021న కురిసిన భారీ వర్షాలకు అన్నారం పంప్‌హౌస్‌లోకి నీళ్లు వచ్చాయి. సుందిళ్ల బ్యారేజీ నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువ ఉండడం, జల్లారం వాగు పొంగడంతో పంప్‌హౌజ్‌లోకి వరద నీరు వచ్చి మోటార్లపై పడినట్లు ఇంజినీర్లు చెప్పారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడ్డా సర్కారు మాత్రం మోటార్లకు రిపేర్లు చేయించి, సైలెన్స్‌గా ఉండిపోయింది.
- అన్నారం పంప్‌హౌజ్ నుంచి నీటి సరఫరా చేసే పైప్‌లైన్ 2021 జూలై 28న భారీ వర్షాలకు భూమిలోంచి పైకి లేచింది. అదే ఏడాది సెప్టెంబర్ 27న సుందిళ్ల బ్యారేజీ కట్ట దెబ్బతింది.
- జూలై 13, 2022న గోదావరికి వచ్చిన వరదలకు వేల కోట్లతో నిర్మించిన కన్నెపల్లి (లక్ష్మి), అన్నారం (సరస్వతి) పంప్‌హౌజ్‌లు నీట మునిగాయి. విదేశాల నుంచి తెప్పించిన 25 బాహుబలి మోటార్లన్నీ నీటి అడుగుకు పడిపోయాయి. లక్ష్మి పంప్‌హౌజ్‌లో గోడ కూలి మోటర్లపై పడడంతో 6 మోటార్లు తుక్కుతుక్కయ్యాయి. సుమారు 6 నెలల పాటు వాటర్ లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇప్పటికీ ఈ పంప్‌హౌజ్‌లు పూర్తిగా అందుబాటులోకి రాలేదు.
- ఈ నెల 21న మేడిగడ్డ బ్యారేజ్‌లోని 20వ పియర్(పిల్లర్) కుంగి మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడింది. 7వ బ్లాక్‌లోని సుమారు 10 పియర్స్(పిల్లర్స్)ని తిరిగి నిర్మించాల్సి వస్తుందని నిపుణులు చెప్పారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు
ఒక్క ఇంజినీర్‌పైనా చర్యల్లేవ్
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిప్పటి నుంచి ఏటా లోపాలు బయటపడ్తున్నా ఇప్పటివరకు ఏ ఒక్క చోటా, ఏ ఒక్క ఇంజినీర్‌పై చర్యలు తీసుకోలేదు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులోని నిర్మాణాలన్నీ నాన్ ఈపీసీ(ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో చేపట్టారు. దీని ప్రకారం ప్రాజెక్టుల ప్లానింగ్, డిజైనింగ్ అంతా సర్కారుదే! భూ సర్వే మొదలుకొని నిర్మాణం పూర్తయ్యే వరకు బాధ్యత అంతా ప్రభుత్వ ఇంజినీర్లపైనే ఉంటుంది. సర్కారు ఫైనల్చేసిన చోట, ఫైనల్ చేసిన డిజైన్ ఆధారంగా ప్రాజెక్టును నిర్మించి ఇవ్వడం వరకే కాంట్రాక్ట్ సంస్థ బాధ్యత అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
ALSO READ : పైసల్ తీసుకో కండువా కప్పుకో.. రోజుకు రూ.300
అలాంటప్పుడు ప్రాజెక్టులో లోపాలు బయటపడినప్పుడు బాధ్యులైన ఇంజినీరింగ్ ఆఫీసర్లపై సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతున్నది. సీఎం కేసీఆర్ సీనియర్ ఇంజినీర్ల హెచ్చరికలను పట్టించుకోకుండా తన సొంత తెలివితేటలతో ప్లాన్లు గీయించి, ప్రాజెక్టులు కట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, అందుకే ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలపై సీఎం కేసీఆర్ మౌనం దాల్చడం వెనుక అసలు కారణం కూడా ఇదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.