ఎమ్మెల్యే రాజకీయ వేధింపులు మానుకోవాలి: పిల్లి రామరాజు యాదవ్

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రాజకీయ వేధింపులు మానుకోవాలంటూ బీఆర్ఎస్ నేత పిల్లి రామరాజు యాదవ్ నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు రామరాజు అనుచరులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. 

నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి వ్యతిరేక నినాదాలు చేశారు. ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న రామరాజు, ఆయన అనుచరులను ఆందోళన చేయడానికి పర్మిషన్ లేదంటూ పోలీసులు సర్ది చెప్పడంతో ర్యాలీని విరమించుకున్నారు.  

తనకు  ప్రాణహాని ఉందంటూ పిల్లి రామరాజు యాదవ్ నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో తన ఫ్లెక్సీలను చింపేయడంతో పాటు, తను ఇచ్చిన విగ్రహాల వద్ద డీజేలను సీజ్ చేయడం, యువకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను అడ్డుపెట్టుకొని వ్యక్తిగత దాడులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.