నల్గొండ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : పిల్లి రామరాజు యాదవ్​

నల్లగొండ నియోజకవర్గంలో నాయకత్వ మార్పు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్​ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు తాను తప్పనిసరిగా ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి నల్లగొండకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అన్ని జిల్లాల అభివృద్ధి జరిగిందని, అందులో భాగంగా నల్గొండను అభివృద్ధి చేశారని చెప్పారు. ఇందులో భూపాల్ రెడ్డి ప్రత్యేకంగా నల్గొండ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.

ALSO READ : ఇన్ని రోజులు ఏం చేశారని.. ఇప్పుడు మా గ్రామానికి వస్తున్నారు

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని ప్రజలు వద్దనుకుంటున్నారని చెప్పారు పిల్లి రామరాజు యాదవ్. నల్గొండ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. త్వరలో నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కార్యాచరణ చేపడుతానని చెప్పారు. ఎవరి బెదిరింపులకు, అక్రమ కేసులకు తాను భయపడేది లేదన్నారు. ప్రజలు తనకు అండగా ఉండి తనను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.