ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసులు వేధిస్తున్నరు: పిల్లి రామరాజుయాదవ్

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసులు తనను వేధిస్తున్నారని ఆర్‌‌‌‌కేఎస్‌‌ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌‌‌‌ఎస్‌‌ రాష్ట్ర నేత పిల్లి రామరాజు యాదవ్ ఆరోపించారు. శుక్రవారం కనగల్ ఎస్సై అంతిరెడ్డిపై నల్లగొండ డీఎస్పీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నల్లగొండలోని వార్డులతో పాటు నియోజక వర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు వినాయక విగ్రహాలు ఇప్పించానని చెప్పారు. కనగల్లు మండలం ధర్వేశిపురం గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ఈనెల 21న పూజా కార్యక్రమాలకు వెళ్లానన్నారు. 

తనకు సౌండ్‌‌తో కూడిన వాహనంతో స్వాగతం పలుకుతుండగా ఎస్సై అంతిరెడ్డి, సిబ్బంది అడ్డుకున్నారని మండిపడ్డారు.  పూజ ముగించుకొని వస్తానని చెప్పినా వినకుండా తిట్టారని ఆరోపించారు. తనకు ఆహ్వానం పలికేందుకు వచ్చిన 8 మంది యువకుల ఇండ్లలోకి వెళ్లి ఫోన్లు లాక్కొని పీఎస్​కు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బహుజన నాయకుడిగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే  ఎమ్మెల్యే పోలీసులు ద్వారా తనను వేధిస్తున్నారని, తన ఫొటోలతో వేసిన ఫ్లెక్సీలు చించివేస్తున్నారని ఆరోపించారు. వెంటనే విచారణ జరిపి ఎస్​ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.