రెంటికీ చెడ్డ పినపాక ఎమ్మెల్యే.. మూడు పదవులున్నా అసంతృప్తి

పార్టీ విప్ ఆయనే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయనే. అయినా పార్టీపై మరొకరి పెత్తనాన్ని చూసి తెగ ఫీలైపోతున్నారట రేగా కాంతారావు. పినపాక నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన రేగా కాంతారావు.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి పార్టీ విప్ అయ్యారు. దాంతో పాటు జిల్లా అధ్యక్ష పదవి కూడా దక్కింది. పేరుకే పెద్దరికమని, చేయడానికి ఏం లేదని సన్నిహితుల దగ్గర తెగ బాధపడుతున్నారట. తనని లెక్క చేసే వారే లేరని మదన పడుతున్నారట. తన సమస్యని పార్టీ పెద్దలకు చెప్పుకుందామంటే సన్నిహితులు వారించారట. సర్దుకుపోతేనే బెటరనే ఆఫ్షన్ రేగాకు సూచించారట. లేదంటే పదవికి స్పాట్ పడుతుందని వార్నింగ్ ఇచ్చారట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏం జరుగుతుందో కూడా రేగాకు సమాచారం లేదట. ఇల్లందులో మున్సిపల్ చైర్మెన్, కౌన్సిర్లకు కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ  వివాదంపై రేగా కాంతారావుకు కనీస సమాచారం కూడా లేదట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సమస్యను పరిష్కరించే  ప్రయత్నం చేయడంతో వివాదం మరింత ముదిరిందట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన వ్యవహారంలో తాతా మధు జోక్యంపై స్థానిక కౌన్సిలర్లు సీరియస్ అయ్యారట. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు.. భద్రాద్రి జిల్లా పార్టీ వ్యవహరంలో జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఎమ్మెల్సీ ఇష్యూతో రేగా కాంతారావు అసమ్మతికి మరింత ఆజ్యం పోసినట్లైందని సమాచారం. 

భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాల సమర్పణ సమయంలోనూ ఖమ్మం జిల్లాధ్యక్షుడి హాడావుడిపై కొందరి దగ్గర రేగా కాంతారావు తన ఆవేదన చెప్పుకున్నారట. విలువ లేని, భరోసా లేని పదవి ఎందుకని పార్టీ పెద్దల్లో కొందరితో రేగా కాంతారావు చర్చించినట్లు సమాచారం. ఇప్పుడు పార్టీపై అసంతృప్తిని వెళ్లగక్కితే రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి మారుతుందని భయపడుతున్నారట. ఉన్న దాంట్లో సర్దుకొని ప్రజల్లో మమేకం అవ్వడమే మేలు అని రేగాకు సలహాలు ఇస్తున్నారట ఆయన సన్నిహితులు.

https://www.youtube.com/watch?v=cW0Rix_hrxw