నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలించిన పీఆర్టీయూ వ్యూహం

నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలించిన పీఆర్టీయూ వ్యూహం
  • వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపు 
  • సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయిన యూటీఎఫ్
  • ఎన్నికల్లో ప్రభావం చూపని బీజేపీ పనిచేయని బీసీ మంత్రం 

నల్గొండ, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 25,797 ఓట్లకు 24,135 పోలయ్యాయి. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, గెలుపు కోసం చివరి వరకు ఉత్కంఠగా కొనసాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో  కోటా ఓట్లు ఎవరికీ రాకపోవడంతో ఎలిమినేషన్ ద్వారా విజేతను ప్రకటించారు. రెండో రౌండ్​ లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. 

ఫలించిన పీఆర్టీయూ వ్యూహం..

మొదటి నుంచి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోటీల్లో నిలబడిన అభ్యర్థులు పీఆర్టీయూ నేపథ్యం ఉన్న వాళ్లు కావడంతో ఓట్లు చీలుతాయని మొదటి నుంచి భావించినప్పటికీ యూనియన్ నేతలు జాగ్రత్త వహించడంతో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు.  

సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయిన యూటీఎఫ్..

సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడంలో యూటీఎఫ్ విఫలమైంది. ఎక్కువ మంది సభ్యత్వాలు కలిగి ఉన్న యూటీఎఫ్ పై మొదటి నుంచి వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా 317 జీవో, స్పౌస్ బదిలీలు, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడడంలో యూటీఎఫ్ విఫలమైంది. మొదటి రౌండ్ నుంచి శ్రీపాల్ రెడ్డితో సమానంగా పోటీలో నిలిచిన నర్సిరెడ్డికి ఓటమి తప్పలేదు. చివరకు రెండో స్థానంలో నిలిచారు.  

ఎన్నికల్లో ప్రభావం చూపని బీజేపీ..

వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి ఐదో స్థానంలో నిలిచారు.

ఫలించని బీసీ మంత్రం..

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి బీసీ వాదాన్ని బలంగా వినిపించాలన్న బీసీ అభ్యర్థుల వ్యూహాలు బెడిసికొట్టాయి. 25 వేల ఓటర్లలో 20 వేల మంది బీసీలు ఉన్నారు. మొదటిసారి బీసీ నినాదంతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్,  సుందర్ రాజ్ యాదవ్ పోటీలో నిలిచారు. కానీ ఇద్దరు అభ్యర్థులకు కలిపి 5 వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 

గెలుపోటములు సహజం 

ఓటమిని అంగీకరిస్తున్నాం. గెలిచిన‌‌ అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలి. ప్రచారం విస్తృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడలేను. 

అలుగుబెల్లి నర్సిరెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థి