
- వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ లీడర్లు
కోల్ బెల్ట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో రామకృష్ణాపూర్–మంచిర్యాల ప్రధాన రహదారిలోని క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్నిర్మాణం పూర్తయ్యిందని టీపీసీసీ స్టేట్జనరల్సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్ తెలిపారు. రైల్వే ఫ్లైఓవర్బ్రిడ్జి ప్రారంభోత్సవ ప్రదేశం, బహిరంగ సభ కోసం చేపట్టిన పనులను శనివారం మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, ఆర్కేపీ టౌన్ ఎస్సై రాజశేఖర్, స్థానిక కాంగ్రెస్ లీడర్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైళ్ల రాకపోకలతో ప్రజలు, ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షించే వారని, వారి కష్టాలను దూరం చేసేందుకు నాడు పెద్దపల్లి ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని సాంక్షన్ చేయించారన్నారు. కానీ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బ్రిడ్జి పనులు పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయించారని హర్షం వ్యక్తం చేశారు.
ఈనెల 15న ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ చేతుల మీదుగా బ్రిడ్జిని ప్రారంభిస్తారని.. బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. పనులు పరిశీలించిన వారిలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, లీడర్లు గాండ్ల సమ్మయ్య, శ్రీనివాస్ గౌడ్, పనాస రాజు, బత్తుల శ్రీనివాస్, కట్ల రమేశ్, బోనగిరి రవీందర్ తదితరులు ఉన్నారు.