![పరిహారం కోసం పిప్పల్ కోటి రిజర్వాయర్ రైతుల పడిగాపులు](https://static.v6velugu.com/uploads/2023/02/Pippal-Koti-Reservoir-farmers-have-not-received-compensation-even-after-four-years_gYqmB5fVNP.jpg)
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెన్ గంగా నదిపై నిర్మించిన చనాఖా–కొర్టా బ్యారేజీ అనుసంధానంగా 1.42 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన పిప్పల్‌కోటి రిజర్వాయర్ ముంపు రైతులకు ఇంకా పరిహారం అందలేదు. 2018లో బ్యారేజీ పనులు ప్రారంభం కాగా 1,024 ఎకరాల భూమి ముంపునకు గురైంది. అధికారులు 198 మంది రైతుల నుంచి భూమిని సేకరించారు. రిజర్వాయర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎకరానికి రూ.8 లక్షలు ఇస్తామని అప్పటి కలెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రకటించారు. సేకరించిన భూమిలో ఇప్పటి వరకు 200 ఎకరాల భూమికే పరిహారం చెల్లించారు. ఇంకా 130 మంది రైతుల భూములకు పరిహారం చెల్లించాల్సి ఉంది. దీని కోసం రైతులు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు.
37 వేల ఎకరాలకు సాగునీరు..
చనాకా–కొర్టా ప్రాజెక్టు ద్వారా బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల రైతులకు 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో పిప్పల్ కోటి రిజర్వాయర్ ద్వారానే 37 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. అయితే పరిహారం విషయంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ రైతులు ఆందోళన బాటపట్టారు. రిజర్వాయర్ ప్రాంతంలో రిలే దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆనకట్ట పనులు అడ్డుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆనకట్ట ఎత్తు పెరుగుతూ వస్తుండటంతో వచ్చే వర్షకాలంలో పంట పొలాల్లో నీరు చేరి నష్టం జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. సమస్య రాకముందే ముందుగా అనుకున్నట్లు రైతులకు పరిహారం చెల్లించాలని, ఎకరానికి రూ. 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రిజర్వాయర్ వివరాలు
సామర్థ్యం 1.42 టీఎంసీ
వ్యయం రూ. 281 కోట్లు
సాగు 37 వేల ఎకరాలు
గ్రామాలు 53
ముంపుగురైన భూమి 1,024 ఎకరాలు
ఎకరానికి రూ.8 లక్షలు
నిర్వాసితులు 130
ప్రతిపాదనలు పంపించినం
పిప్పల్ కోటి రిజర్వాయర్‌కు సంబంధించి రైతులకు పరిహారం విషయంపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. గతంలో కొంత మందికి పరిహారం అందించాం. ఇటీవల మరో రూ. 15 కోట్లు మంజూరు కావడంతో వాటిని అందించేందుకు ప్రతిపాదనలు పంపించాం.
– రమేశ్ రాథోడ్, ఆర్డీవో ఆదిలాబాద్
పది ఎకరాలు కోల్పుతున్నా
పిప్పల్ కోటి రిజర్వాయర్ కోసం నాలుగేళ్ల క్రితమే అధికారులు భూసేకరణ చేపట్టారు. నాది 10 ఎకరాల భూమి ముంపునకు గురైంది. అప్పట్లో ఎకరానికి రూ. 8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటి వరకు ఆ పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడేమో ఎకరానికి రూ. ఏడు లక్షలు ఇస్తామంటున్నారు.
– దొనిపెల్లి స్వామి, బాధిత రైతు