Champions Trophy 2025: ఇకపై స్టేడియంలోకి నో ఎంట్రీ: రచీన్ రవీంద్రపై దూసుకొచ్చిన వ్యక్తి అరెస్ట్

Champions Trophy 2025: ఇకపై స్టేడియంలోకి నో ఎంట్రీ: రచీన్ రవీంద్రపై దూసుకొచ్చిన వ్యక్తి అరెస్ట్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం (ఫిబ్రవరి 24) బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రచీన్ రవీంద్రపై దూసుకొచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ నాయకుడు తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ ఫోటోను చేత్తో పట్టుకొని వచ్చాడని ఆరోపిస్తూ ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అంతేకాదు ఆ చొరబాటుదారుడు ఇకపై పాకిస్తాన్‌లోని అన్ని క్రికెట్ వేదికలలో  ప్రవేశించకుండా నిషేధానికి గురయ్యాడు.

 ఈ ఘటన అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అన్ని వేదికల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. "భద్రతను లెక్క చేయకుండా పిచ్ పైకి దూసుకొచ్చిన వ్యక్తిని అరెస్టు చేసి మంగళవారం (ఫిబ్రవరి 25) కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో పాటు అతనిపై పాకిస్థాన్ లో జరగబోయే ఎలాంటి క్రికెట్ మ్యాచ్ చూడకుండా శాశ్వతంగా నిషేధించారు" అని ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చింది. 

అసలేం జరిగిందంటే..? 

సోమవారం(ఫిబ్రవరి 24) బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన గ్రూప్ ఏ లీగ్ మ్యాచ్ లో ఒక వ్యక్తి సెక్యూరిటీని దాటి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. న్యూజిలాండ్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కివీస్ క్రికెటర్ రచీన్ రవీంద్రను వెనక నుంచి పట్టుకున్నాడు. సెక్యూరిటీని ధాటి అతడు చాలా ధైర్యంగా లోపలి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

గ్రౌండ్ లోకి వస్తున్నప్పుడు ప్లేయర్లందరూ గ్రౌండ్ లో షాక్ అయ్యి చూస్తుండగా.. ఆ వ్యక్తి వెనక వైపు నుంచి రావడంతో రచీన్ రవీంద్ర ఒక్కసారిగా భయపడ్డాడు. చేతిలో ఏదో కాగితం పట్టుకొని అందరికీ చూపిస్తున్నాడు.  ఆ తర్వాత సెక్యూరిటీ అతన్ని అడ్డుకుని మైదానం నుండి బయటకు తీసుకెళ్లారు. దీంతో మ్యాచ్ కు కాసేపు అంతరాయం ఏర్పడింది. 5 నిమిషాలకే అంపైర్ మళ్ళీ ఆటను కొనసాగించారు. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.