IND vs AUS: మైదానంలోకి దూసుకొచ్చి.. కోహ్లీ భుజాలపై చేతులేసి.. అభిమాని దుస్సాహసం

IND vs AUS: మైదానంలోకి దూసుకొచ్చి.. కోహ్లీ భుజాలపై చేతులేసి.. అభిమాని దుస్సాహసం

మెల్‌బోర్న్‌ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆటలో ఓ అభిమాని అత్యుత్సాహం చూపాడు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి  చొచ్చుకురావడమే కాకుండా.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భుజాలపై చేతులేసి ఫోటోలకు పోజులిచ్చాడు. రెండో రోజు ఆట ప్రారంభమైన గంటలోపే ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆటకు అంతరాయం

ఆస్టేలియా ఇన్నింగ్స్ 97వ ఓవర్ మధ్యలో ఆక్రమణదారుడు మైదానంలోకి ప్రవేశించాడు. నేరుగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి అతన్ని కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. అనంతరం కోహ్లీ భుజలపై చేతులేసి నడవసాగాడు. భద్రతా అధికారులు పరుగెత్తి అతన్ని పట్టుకునే ముందు పాటకు స్టెప్పులేస్తున్నట్లు నృత్య కదలికలు ప్రదర్శించాడు. ఎట్టకేలకు అతన్ని పట్టుకున్న భద్రతా సిబ్బంది ఆక్రమణదారుడిని మైదానం నుండి బయటికి తీసుకెళ్లారు. ఈ ఘటన కారణంగా కొద్దిసేపు ఆట ఆగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read :- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు భారత క్రికెటర్ల సంతాపం

ఆస్ట్రేలియా భారీ స్కోర్ 

ఇక మెల్‌బోర్న్ టెస్టు విషయానికొస్తే.. మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(140) సెంచ‌రీ చేయగా.. సామ్ కొంటాస్(60), ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72) హాఫ్ సెంచరీలు చేశారు. లోయర్ ఆర్డర్ లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్(49) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా 4, జడేజా 3, ఆకాష్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు.