Champions Trophy 2025: పాకిస్థాన్‌లో ఏం జరుగుతోంది: న్యూజిలాండ్ క్రికెటర్‌పై దూసుకొచ్చిన వ్యక్తి

Champions Trophy 2025: పాకిస్థాన్‌లో ఏం జరుగుతోంది: న్యూజిలాండ్ క్రికెటర్‌పై దూసుకొచ్చిన వ్యక్తి

ఛాంపియన్స్ ట్రోఫీలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. సోమవారం(ఫిబ్రవరి 24) బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన గ్రూప్ ఏ లీగ్ మ్యాచ్ లో ఒక వ్యక్తి సెక్యూరిటీని దాటి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. న్యూజిలాండ్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కివీస్ క్రికెటర్ రచీన్ రవీంద్రను వెనక నుంచి పట్టుకున్నాడు. సెక్యూరిటీని ధాటి అతడు చాలా ధైర్యంగా లోపలి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

గ్రౌండ్ లోకి వస్తున్నప్పుడు ప్లేయర్లందరూ గ్రౌండ్ లో షాక్ అయ్యి చూస్తుండగా.. ఆ వ్యక్తి వెనక వైపు నుంచి రావడంతో రచీన్ రవీంద్ర ఒక్కసారిగా భయపడ్డాడు. చేతిలో ఏదో కాగితం పట్టుకొని అందరికీ చూపిస్తున్నాడు.  ఆ తర్వాత సెక్యూరిటీ అతన్ని అడ్డుకుని మైదానం నుండి బయటకు తీసుకెళ్లారు. దీంతో మ్యాచ్ కు కాసేపు అంతరాయం ఏర్పడింది. 5 నిమిషాలకే అంపైర్ మళ్ళీ ఆటను కొనసాగించారు. కొంత సేపు స్టేడియంలో ప్రేక్షకులకు ఈ సంఘటన షాకింగ్ కు గురి చేసింది. అసలే ఈ టోర్నీకి ముందు పాకిస్థాన్ లో భధ్రతపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ సమయంలో ఇలా జరగడం వైరల్ గా మారుతుంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే సోమవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. కివీస్ గెలుపుతో భారత్ కూడా సెమీస్ లో అడుగుపెట్టింది. మరోవైపు ఆతిథ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు అధికారికంగా టోర్నీ నుండి నిష్క్రమించాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. కెప్టెన్‌ నజ్ముల్ హొస్సేన్ శాంటో (77; 110 బంతుల్లో 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఆఖర్లో జాకెర్‌ అలీ (45), రిషాద్‌ హొస్సేన్‌ (26) రాణించడంతో బంగ్లా ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్‌ 4 వికెట్లు తీయగా, విలియం ఓ రూర్క్‌ 2, కైల్‌ జేమీసన్‌, మ్యాట్‌ హెన్రీ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఛేదనలో విల్ యంగ్(0), కేన్ విలియంసన్(5)లను ఔట్ చేశామన్న ఆనందం తప్ప బంగ్లా ఆటగాళ్లకు మిగిలిందేమీ లేదు. రెండు వికెట్లు పడటంతో తొలుత జాగ్రత్తగా ఆడిన న్యూజిలాండ్‌ బ్యాటర్లు.. పవర్‌ ప్లే చివరలో బౌండరీల మోత మోగించారు. డెవాన్‌ కాన్వే(30), రచిన్‌ రవీంద్ర (112) ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు రాబట్టారు. అయితే, 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కాన్వే ఔటయ్యాడు. ఆ సమయంలో మ్యాచ్ కాస్త మజా అనిపించింది. కానీ,  ఆ ఉత్కంఠ ఎంతోసేపు నిలవలేదు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రచిన్.. టామ్‌ లాథమ్‌(55)తో కలిసి జట్టు స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. చివరలో రచిన్, లాథమ్‌ ఔటైనా.. గ్లెన్ ఫిలిప్స్(21 నాటౌట్), మైఖేల్ బ్రేస్‌వెల్(11 నాటౌట్) జోడి జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ముగించారు.