భోపాల్​ గ్యాస్ వ్యర్థాలను మా దగ్గర తగలబెట్టొద్దు.. పీతంపూర్లో ఆందోళనలు

భోపాల్​ గ్యాస్ వ్యర్థాలను మా దగ్గర తగలబెట్టొద్దు.. పీతంపూర్లో ఆందోళనలు

ధార్​(మధ్యప్రదేశ్): భోపాల్ గ్యాస్ వ్యర్థాలను తమ ప్రాంతంలో తగలబెట్టొద్దని పీతంపూర్ వాసులు ఆందోళనలు చేపట్టారు. యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి వ్యర్థాలను పీతంపూర్ తరలించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పీతంపూర్ బచావ్ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానికంగా బంద్​నిర్వహించారు.

 ఐదారువందల మంది ఆందోళన చేపట్టారు. ఇద్దరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలపగా.. ప్రమాదవశాత్తూ నిప్పంటుకోవడంతో గాయాలపాలయ్యారు. శనివారం వందలాదిగా సదరు వేస్ట్ మేనేజ్ కంపెనీ వరకు ర్యాలీ తీశారు. 

పోలీసులు అడ్డుకోవడంతో కంపెనీ గేటుపైకి రాళ్లు విసిరారు. భోపాల్ గ్యాస్ వ్యర్థాలను తమ ఏరియాలో దహనం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కాగా, ర్యాలీ సందర్భంగా రాంకీ గ్రూప్ కు చెందిన వేస్ట్ మేనేజ్ మెంట్ కంపెనీ గేటుపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఎందుకు అడ్డుకుంటున్నరంటే..

యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అయి 1984లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత విషవాయువు వ్యర్థాలను సేకరించి జాగ్రత్తగా నిల్వ చేశారు. ఇటీవల వీటిని తొలగించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. కార్బైడ్ కంపెనీ నుంచి పీతంపూర్​లోని రాంకీ వేస్ట్ మేనేజ్​మెంట్ కంపెనీకి 12 కంటైయినర్లలో తరలించారు. 337 టన్నుల వ్యర్థాలను నిర్వీర్యం చేసేందుకు 3 నుంచి 9 నెలల వరకు సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ వ్యర్థాలను డిస్పోజ్ చేసే క్రమంలో తమ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని స్థానికులలో ఆందోళన నెలకొంది.