స్కూళ్లు..హాస్టళ్ల తనిఖీ : పిట్లం తహసీల్దార్​ వేణుగోపాల్​

స్కూళ్లు..హాస్టళ్ల తనిఖీ : పిట్లం తహసీల్దార్​ వేణుగోపాల్​

పిట్లం, వెలుగు: ఫుడ్​పాయిజన్​తో హాస్టళ్లలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండడంతో  కలెక్టర్ ఆదేశాలతో పిట్లం తహసీల్దార్​ వేణుగోపాల్​ హాస్టళ్లలో తనిఖీలు చేశారు. మంగళవారం పిట్లం బీసీ బాలికలు, ఎస్సీ బాలుర హాస్టల్ ను సందర్శించారు.  పిల్లలకు అందించే భోజనాన్ని, వంట తయారీ సరుకులను  పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్​ మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులకు అందించే ఆహారాన్ని  తనిఖీ చేశామన్నారు. తనిఖీ రిపోర్ట్ ను​కలెక్టర్​కు పంపిస్తామని తెలిపారు. 


సదాశివనగర్, వెలుగు: రామారెడ్డి కస్తుర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం మండల ప్రత్యేక అధికారి సంజయ్​ కుమార్, మండల విద్యాధికారి ఆనంద్​రావు తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసి తల్లిదండ్రుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థుల తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలన్నారు.  అనుభవం గల ఉపాధ్యాయులతో బోధన, వసతులను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.  అనంతరం వసతి గృహంలో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు.  

 భిక్కనూరు,వెలుగు: మండలంలోని జంగంపల్లి కస్తూర్బాగాంధీ బాలకల పాఠశాలను మంగళవారం అడిషనల్​ కలెక్టర్​ సందర్శించారు. హాస్టల్ స్పెషల్​ఆఫీసర్​హరిప్రియతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలన్నారు.   అనంతరం సౌత్​క్యాంపస్​లో జరుగుతున్న సమగ్ర సర్వే డేటాఎంట్రీని పరిశీలించి ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు.  భిక్కనూరులో నర్సరీని సందర్శించి  కార్యదర్శి మహేశ్​గౌడ్​తో మాట్లాడి నర్సరీలో అరుదైన మొక్కలు పెంచాలన్నారు. ఆయన వెంట  మండల ప్రత్యేక అధికారి రజిత, ఎంపీడీవో రాజ్​కిరణ్​రెడ్డి, సిబ్బంది ఉన్నారు. 

నందిపేట, వెలుగు: నందిపేట కస్తూర్బా గాంధీ పాఠశాల, అయిలాపూర్​ ఎస్సీ బాలుర హాస్టల్ ను మంగళవారం అడిషనల్​కలెక్టర్ కిరణ్​కుమార్​తనిఖీ చేశారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. భోజనం సరిగా అందించకుంటే ఫిర్యాదు చేయాలని  విద్యార్థులకు సూచించారు.  చలి తీవ్రత ఎక్కువగా ఉందని,  దుప్పట్లు  ఇంకా రాలేదని స్టూడెంట్లు ఆయన దృష్టికి తీసుకురాగా ఈ ఏడాది ఆలస్యమైందని, త్వరలో వస్తాయని వార్డెన్లు తెలిపారు.