నిజామాబాద్​లో పసుపు బోర్డు షురూ

  • వర్చువల్​గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్​
  • వినాయక్​ నగర్​లో తాత్కాలిక ఆఫీసు

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్​ విధానంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్​​ గోయల్  దీన్ని ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఉన్నారు. ఈ వేడుకను రైతులు చూసేందుకు అనువుగా నిజామాబాద్​లోని నిఖిల్​సాయి హోటల్​లో ఎల్​ఈడీ స్క్రీన్​ఏర్పాటు చేశారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్​గా నియమితులైన పల్లె గంగారెడ్డి.. నిజామాబాద్​లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘సంక్రాంతి పండుగ కానుకగా పసుపు రైతుల కలను ప్రధాని మోదీ సాకారం చేశారు. 

పసుపు సాగుతో దేశంలోనే గుర్తింపు పొందిన నిజామాబాద్​ జిల్లా రైతులు.. బోర్డు ఏర్పాటుతో మరింత క్రియాశీలం కాబోతున్నారు” అని పేర్కొన్నారు.బోర్డు మొదటి చైర్మన్​గా తనను నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం నిజామాబాద్​ జిల్లా కేంద్రం వినాయక్​నగర్​లో ఉన్న స్పైసెస్​ బోర్డు ఆఫీసునే తాత్కాలికంగా పసుపు బోర్డు ఆఫీసుగా మార్చారు. అక్కడే కొత్త బోర్డును ఏర్పాటు చేశారు.

ఉత్పత్తి  మరింత పెంచాలి: గోయల్

వరల్డ్​ మార్కెట్​లో పసుపు అవసరాన్ని మన దేశం 70 శాతం తీరుస్తున్నదని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ అన్నారు. ఢిల్లీ నుంచి పసుపు బోర్డును వర్చువల్​గా  ప్రారంభించి ఆయన మాట్లాడారు. ‘‘వివిధ రాష్ట్రాలలో 30 రకాల పసుపు పండుతుండగా తెలంగాణలోని పసుపునకు మంచి డిమాండ్ ఉంది. ఎన్నో అంశాలను పరిశీలించాక నిజామాబాద్​లో బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. దీని వెనుక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్  గణనీయ కృషి ఉంది. 40 ఏండ్ల కలను సాకారం చేస్తూ ఏర్పాటు చేస్తున్న బోర్డుతో పసుపు రైతుల జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి” అని పేర్కొన్నారు. పసుపు ఉత్పత్తి మరింత  పెంచి ప్రపంచ మార్కెట్​లో సత్తా చాటాలని, లక్ష్యం దిశగా బోర్డు చైర్మన్  పల్లె గంగారెడ్డి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

బోర్డు ఏర్పాటు గేమ్ చేంజర్​: అర్వింద్​

నిజామాబాద్​లో పసుపు బోర్డు ఏర్పాటు గేమ్ చేంజర్​ కాబుతున్నదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు మార్కెట్ తీరు పూర్తిగా మారి రైతుల జీవితాల్లో కొత్త వెలుగు వస్తుందని చెప్పారు. బోర్డు ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి పాదాభివందనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.