న్యూఢిల్లీ : టెస్లా వంటి ఫారిన్ కంపెనీలు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలను క్రియేట్ చేస్తామని, కానీ వీటిని మిస్ అయితే అది వాళ్లకే నష్టమని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయెల్ అన్నారు. టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇస్తే మొదటి రోజే లక్ష బండ్లకు బుకింగ్స్ అందుకుంటుందని కామెంట్ చేశారు.
‘ఇండియాను ఎంచుకుంటారా? లేదా? అనేది మేము నిర్ణయించలేము. మరిన్ని కంపెనీలను ఆకర్షించే చర్యలను సంతోషంగా తీసుకుంటాం. టెస్లా, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్, వోల్వో వంటి కంపెనీలు ఇండియాలో తయారీ చేపట్టాలని కోరుకుంటున్నాం’ అని ఆయన వివరించారు.
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఐదేండ్లలో నెంబర్ వన్ : గడ్కరీ
ఇంకో ఐదేండ్లలో ఇండియా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఎదుగుతుందని యూనియన్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ అంచనా వేశారు. ఇండస్ట్రీ గ్రోత్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్ ముందుండి నడిపిస్తాయని అన్నారు. నెట్‌వర్క్18 గ్రీన్ భారత్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. తాను మినిస్టర్‌గా బాధ్యతలు తీసుకునే టైమ్‌కి రూ.7 లక్షల కోట్లుగా ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు.
‘తాజాగా జపాన్ ఆటోమొటైల్ ఇండస్ట్రీని దాటి మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించాం. రూ.78 లక్షల కోట్లతో యూఎస్ టాప్‌లో ఉంది. రూ.47 లక్షల కోట్ల సైజ్‌తో చైనా రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇంకో ఐదేళ్లలో నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంటామని నాకు నమ్మకం ఉంది’ అని గడ్కరీ అన్నారు. త్వరలో ఇండియాలోనే క్రూయిజ్ షిప్‌లు తయారవుతాయని, వాటర్‌వేస్‌ను కూడా డెవలప్ చేస్తున్నామని పేర్కొన్నారు.