ధరలు పెరుగుతాయని అత్యాశకు పోవద్దు
బిల్డర్లకు మంత్రి పీయుష్ గోయల్ సలహా
రియల్టీని తప్పకుండా ఆదుకుంటామని హామీ
నష్టపోయిన రియల్లీ కంపెనీల షేర్లు
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉండి కూడా ఫ్లాట్లను, బిల్డింగులను అమ్మకుండా, ఎక్కువ ధరల కోసం ఆశపడుతున్న డెవలపర్లపై కేంద్ర కామర్స్, ఇండస్ట్రీస్ మంత్రి పీయుష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ఇన్వెంటరీని అమ్ముకోవాలని ఎన్నిసార్లు చెప్పినా డెవలపర్లు వినడం లేదని మండిపడ్డారు. బిల్డింగులను నిర్మించి న్యాయమైన ధరలకు అమ్మడం తప్ప డెవలపర్లకు వేరే మార్గమేదీ లేదని స్పష్టం చేశారు. మార్కెట్ పుంజుకుంటుందనే అంచనాలతో వ్యాపారాలను నాశనం చేసుకోవద్దని మంత్రి హెచ్చరించారు. ‘‘బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ పూర్తయ్యాకే అమ్మకాలు మొదలుపెట్టండి. నిర్మాణంలో ఉన్న బిల్డింగులను ఎవరూ కొనడం లేదు. నా జీవితంలో నేను ఎన్నడూ ‘అండర్ కన్‌స్ట్రక్షన్’ బిల్డింగ్‌ను కొనలేదు. ఎంతో మంది బిల్డర్లు కస్టమర్లను మోసం చేస్తున్నారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయండి. ఇందుకోసం పార్ట్‌నర్లను, ఇన్వెస్టర్లను చూసుకోండి. కన్‌స్ట్రక్షన్ పూర్తి చేసి, న్యాయమైన ధరలకు అమ్మడం తప్ప మీకు వేరే మార్గమే లేదు’’ అని గోయల్ స్పష్టం చేశారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) బెంగళూరులో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన టాప్ డెవలపర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవడానికి సర్కిల్ రేట్లను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని, అయినప్పటికీ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా అమ్మాలని స్పష్టం చేశారు.
అమ్మకాలు ఆపితే దివాలా తీస్తారు..
‘‘ఇన్వెంటరీని అలాగే పెట్టుకొని దివాలా తీయాలా లేదా వీలైనంత త్వరగా యూనిట్లను అమ్మి గట్టెక్కాలా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. మార్కెట్ గాడినపడుతుందని, ప్రభుత్వం ఇంకా లోన్లు ఇస్తుందని అనుకోవద్దు. ఇప్పటికిప్పుడు మార్కెట్ పుంజుకోవడం సాధ్యపడదు. ఇన్వెంటరీని అమ్ముకొని బ్యాంకు లోన్లను కట్టిన వారే గట్టెక్కగలరని గత అనుభవాలు చెబుతున్నాయి’’ అని మంత్రి అన్నారు. కరోనా లాక్‌డౌన్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం నష్టపోయిన సంగతి తెలిసిందే. వలస కూలీలు, ముడిపదార్థాలు దొరక్కపోవడం వల్ల కన్‌స్ట్రక్షన్లు ఆగిపోయాయి. అమ్మకాలు తగ్గాయి. బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో డెవలపర్ల దగ్గర డబ్బులు అయిపోయాయి. ఈ విషయమై హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ మాట్లాడుతూ చేతిలోకి డబ్బు రావడం డెవలపర్లకు ఇప్పుడు ముఖ్యమని అన్నారు. ఆర్‌బీఐ రియల్టీకి రీస్ట్రక్చర్ లోన్లు ఇవ్వాలని, రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీని రద్దు చేయాలని అన్నారు. తక్కువ ధరకు అయినా ప్రాజెక్టులను అమ్ముకోవడమే మంచిదని పరేఖ్ కూడా సలహా ఇచ్చారు. ఇదిలా ఉంటే, పీయుష్ కామెంట్స్ నేపథ్యంలో రియల్టీ కంపెనీల షేర్లు గురువారం నష్టపోయాయి.
For More News..