
హైదరాబాద్, వెలుగు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో యూపీ యోధాస్ మూడో విజయాన్ని అందుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 35–29తో గుజరాత్ జెయింట్స్‌పై నెగ్గింది. యూపీ జట్టులో భరత్ ఒక్కడే 13 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. గుజరాత్ రైడర్ రాకేశ్ 8 పాయింట్లు సాధించినా మిగతా వారు అండగా నిలవలేదు. ఇక జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ 30–30తో డ్రా అయ్యింది. జైపూర్ జట్టులో రైడర్ అర్జున్ దేస్వాల్ (7), వికాస్ ఖండోలా (6), అంకూష్ రాథీ (4) రాణించారు. తలైవాస్ రైడర్ సచిన్ 11 పాయింట్లు రాబట్టినా మిగతా వారు విఫలమయ్యారు. నరేందర్, అభిషేక్, ఆశిష్ తలో మూడు పాయింట్లు తెచ్చారు.