సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కంప్లయింట్ బాక్సులు పెట్టండి

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కంప్లయింట్ బాక్సులు పెట్టండి
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • ఫిర్యాదులను ఉన్నతాధికారులు పరిశీలించాలి
  • సమస్య నిజమని తేలితే చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు:  సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రజలు తమ ఫిర్యాదులను, వినతులను సమర్పించేందుకు వీలుగా కంప్లయింట్ బాక్సులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘‘ఫిర్యాదులు, వినతులపై రిజిస్ట్రార్ లేదా ఆపై ఉన్నతాధికారి పరిశీలించి, విచారణ చేపట్టాలి. అధికారులపై ఆరోపణలు నిజమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ప్రజలకు నమ్మకం పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాం” అని హైకోర్టు స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్​లో.. జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1 తన ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ కేపీహెచ్​బీకి చెందిన పి.రమ్యశ్రీ,  మరొకరు దాఖలు చేసిన పిటిషన్​ను హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్ వీ శ్రవణ్ కుమార్ ఇటీవల విచారించారు. అక్టోబర్ 11న ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని కోరగా.. ఆ రోజున చేయాలంటే లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది డిమాండ్ చేశారని పిటిషనర్ల తరఫు లాయర్ వాదించారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్​ను సాక్ష్యంగా చూపించారు. అధికారులు లక్ష్మణ్ రెడ్డి, సాయిలుతోపాటు డాక్యుమెంట్ రైటర్ కలిసి మొత్తం రూ.2 లక్షలు డిమాండ్ చేశారన్నారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వివరణ ఇస్తూ.. పిటిషనర్ ఎలాంటి దరఖాస్తును, డాక్యుమెంట్​ను సమర్పించనందుకే రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. తాము లంచం అడిగామనడం నిరాధార ఆరోపణలని చెప్పారు. పిటిషనర్ చెప్తున్న రోజున తాను సెలవులో ఉన్నానని, అందుకు సంబంధించి రిజిస్ట్రార్ ఇచ్చిన ధ్రువపత్రాన్ని అందజేశారు. 

ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి.. 

విచారణ సందర్భంగా జడ్జి స్పందిస్తూ.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వచ్చే వాళ్ల వివరాల నమోదుకు ఒక రిజిస్టర్ ఏర్పాటు చేయాలని గత జులైలో ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు కాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనితో పాటు తాజా ఆదేశాల అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా గతంలో జారీ చేసినవాటితోపాటు తాజా మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను ఉన్నతాధికారులు పరిశీలించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతుల కాపీలను తమ వద్ద ఉంచుకోవాలని, నిర్ణీత కాలంలో పరిష్కారం కాకపోతే అప్పీల్ చేయవచ్చన్నారు. 

జాయింట్ సబ్ రిజిస్ట్రార్​పై విచారణ.. 

ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1పై విచారణ చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ కు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఈ పిటిషన్లో ప్రతివాది కాకపోయినా తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. పిటిషనర్ తాజాగా రిజిస్ట్రేషన్ నిమిత్తం డాక్యుమెంట్ సమర్పించాలని, దాన్ని పరిశీలించి వారంలోగా చర్యలు తీసుకోవాలని జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1కు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను డిసెంబరు 10వ తేదీకి వాయిదా వేశారు.