
- భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నరన్న రాజ్‌నాథ్ సింగ్
- కేంద్ర మంత్రితో తులసి గబ్బార్డ్ భేటీ
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే)పై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికాను మన దేశం కోరింది. అమెరికా అడ్డాగా భారత్‌కు వ్యతిరేకంగా ఎస్ఎఫ్‌జే కార్యకలాపాలు కొనసాగిస్తోందని తెలిపింది. యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సోమవారం ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖలిస్తానీల అంశాన్ని ఆయన లేవనెత్తారు. ‘‘ఎస్ఎఫ్‌జేను భారత్‌లో నిషేధించాం. ఆ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ అమెరికాలో ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. చట్టవిరుద్ధమైన ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోండి” అని తులసి గబ్బార్డ్‌కు రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, పన్నూన్ హత్యకు కుట్ర పన్నారని, దాన్ని తాము భగ్నం చేశామని, ఇందులో భారత్ హస్తం ఉందని అమెరికా గతంలో ఆరోపణలు చేసింది.
వివిధ అంశాలపై చర్చ..
ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో సహకారంపై రాజ్‌నాథ్, తులసి గబ్బార్డ్ చర్చించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. డిఫెన్స్, టెక్నాలజీ రంగాల్లో, ఇన్ఫర్మేషన్ షేరింగ్‌లో ఒకరికొకరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇండో–పసిఫిక్ రీజియన్‌లో పరిస్థితులపై చర్చించారు. తులసి గబ్బార్డ్‌తో మీటింగ్ చాలా బాగా జరిగిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ‘‘తులసి గబ్బార్డ్‌ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. వివిధ అంశాలపై చర్చించాం. రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా సమావేశం జరిగింది” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
ట్రంప్, మోదీ మంచి దోస్తులు: తులసి
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని మోదీ మంచి దోస్తులని తులసి గబ్బార్డ్ తెలిపారు. “రెండు గొప్ప దేశాలకు ఇద్దరు ఉత్తమ నాయకులు ఉన్నారు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. ఉమ్మడి లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు. టెర్రరిజాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు” అని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఎన్డీటీవీకి తులసి ఇంటర్వ్యూ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై అమెరికా ఆందోళన చెందుతున్నదని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ చూస్తున్నారని.. శాంతి స్థాపన కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.