- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మునగ సాగుకు ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో వాతావరణానికి అనుకూలంగా, ఆయుర్వేదానికి ఉపయోగపడే మొక్కలు పెంచాలన్నారు. స్కూళ్లు, గవర్నమెంట్ ఆఫీసుల్లోని ఖాళీ ప్రదేశాల్లో మునగ, ఉసిరి, మేడి, మారేడు, అల్లనేరేడు లాంటి మొక్కలు నాటాలని సూచించారు. పత్తి, మొక్కజొన్న పంటల్లో అంతర్ పంటలతో పాటు ప్రత్యామ్నాయ సాగును ప్రోత్సహించాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆయిల్ పామ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. నాటుకోళ్లు, పుట్టగొడుగులు, అజోల్ల పెంపకం చేసే రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. ఈ నెల 20లోపు నిర్దేశించిన పట్టిక ద్వారా పంచాయతీల సమగ్ర ప్రణాళికలను అందజేయాలన్నారు. పీఎం విశ్వకర్మ స్కీంకు ఇప్పటి వరకు 11,500 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీపీవో చంద్రమౌళి, డీఏవో బాబూరావు, జిల్లా పరిశ్రమల అభివృద్ధి అధికారి పృథ్వీ పాల్గొన్నారు.