మండలి చైర్మన్ గుత్తాపై అవిశ్వాసానికి ప్లాన్!

  • ఎమ్మెల్సీలకు బీఆర్​ఎస్​ హైకమాండ్​ సంకేతాలు

నల్గొండ, వెలుగు: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్​ హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాక మండలిలో గుత్తాకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టాలని ఇప్పటికే పార్టీ ఎమ్మెల్సీలకు సంకేతాలు పంపినట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల టైంలో సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కాంగ్రెస్​లో చేరిన సంగతి తెలిసింది. 

ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్​లోని గుత్తా అనుచరులు మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్​లో చేరారు. అమిత్ రెడ్డి నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశించగా.. ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. పైగా సుఖేందర్ రెడ్డి పైనే హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సుఖేందర్ రెడ్డి కేసీఆర్ చెప్పుడు మాటలు వినడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని ఎంపీ ఎన్నికల టైంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుఖేందర్ రెడ్డిని చైర్మన్​ పదవి నుంచి దింపాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నది.

మండలిలో బలాబలాలు ఇవీ...

మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మహబూబ్​నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరిగాయి. ఇంకా ఫలితాలు వెల్లడించలేదు. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానానికి సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నాలుగు మినహాయిస్తే ప్రస్తుతం మండలిలో 36 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మండలి చైర్మన్ పదవి నుంచి దింపడానికి మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీ ఉండాలి. 

ప్రస్తుతం 26 మంది సభ్యులు అవిశ్వాసానానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పక్షాన 30 మంది ఎమ్మెల్సీలు ఉన్నట్టు మండలి రికార్డులు చెప్తున్నాయి. కానీ దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్​లో చేరారు. చైర్మన్​ సుఖేందర్ రెడ్డితో కలిపితే కాంగ్రెస్ లో చేరిన వారి సంఖ్య మూడుకు పెరిగింది. వీరిని మినహాయిస్తే బీఆర్ఎస్ తరఫున 27 మంది ఉంటారు. ఎంఐఎంకు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండగా, బీజేపీ కి ఒకరు ఉన్నారు. కాంగ్రెస్​కు ముగ్గురు ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీలు ఇద్దరు ఓటింగ్​కు దూరంగా ఉండే అవకాశం ఉంది.