సిద్దిఖీ కొడుకును కూడా హతమార్చేందుకు ప్లాన్​

సిద్దిఖీ కొడుకును కూడా హతమార్చేందుకు ప్లాన్​
  • జీశాన్​ సిద్దిఖీ హత్యకు కాంట్రాక్ట్​ తీసుకున్నట్టు షూటర్ల వెల్లడి


ముంబై: మహారాష్ట్రలో కలకలం రేపిన బాబా సిద్దిఖీ హత్యకు సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. లారెన్స్​ బిష్ణోయ్ ​గ్యాంగ్​ హిట్​లిస్ట్​లో బాబా సిద్దిఖీ కుమారుడు, ఎమ్మెల్యే జీశాన్​ సిద్దిఖీ పేరు కూడా ఉందని ముంబై పోలీసులు గుర్తించారు. తండ్రీ కొడుకులిద్దరినీ చంపేందుకు తమకు బిష్ణోయ్​ గ్యాంగ్​ కాంట్రాక్ట్​ ఇచ్చినట్టు షూటర్లు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.

మర్డర్ ​స్పాట్​లో తండ్రీ కొడుకులిద్దరు ఉన్నారు. కానీ.. ఇద్దరిపై అటాక్​ చేయలేకపోయాం. ఇద్దరినీ చంపేయాలని బిష్ణోయ్​ గ్యాంగ్ చెప్పింది. కుదరకపోతే ముందు ఎవరు దొరికితే వారిని షూట్​ చేయాలని చెప్పింది’ అని వారు పేర్కొన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, ముంబైలోని వంద్రే ఈస్ట్ నుంచి జీషన్ సిద్దిఖీ కాంగ్రెస్‌‌ టికెట్‌‌పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్‌‌ ఓటింగ్‌‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో పార్టీ ఆయనను బహిష్కరించింది.

సిద్దిఖీ హత్యకేసులో మూడో అరెస్ట్​

బాబా సిద్దిఖీ హత్య కేసుతో సంబంధమున్న మూడో వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. సిద్దిఖీ హత్య తమ పనేనంటూ బిష్ణోయ్ గ్యాంగ్ తరఫున ఫేస్​బుక్​లో పోస్ట్ పెట్టిన పుణెకు చెందిన శుభం లోంకర్ సోదరుడు ప్రవీణ్ లోంకర్(28)​ను ముంబై క్రైమ్​బ్రాంచ్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ముగ్గురిలో ఇద్దరు షూటర్లకు ప్రవీణ్, శుభం సహకరించారని సమాచారం. ధర్మరాజ్ ​రాజేశ్​ కశ్యప్,  శివకుమార్​ గౌతమ్​కు వీరిద్దరూ కోఆపరేట్​ చేశారని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కశ్యప్​తోపాటు మరో నిందితుడు గుర్మైల్​ బల్జిత్​ సింగ్​ను పోలీసులు అరెస్ట్ చేయగా.. శివకుమార్​ గౌతమ్​ పరారీలో ఉన్నాడు. శుభం లోంకర్​ను వెతికేందుకు పుణె వెళ్లగా.. అతడి ఆచూకీ లభించలేదని, అతడి సోదరుడు ప్రవీణ్​ లోంకర్​ చిక్కాడని పోలీసులు వెల్లడించారు.  

కాగా, నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. ఇద్దరికీ ఈ నెల 21 వరకు జ్యుడీషియల్​​ కస్టడీ విధిస్తున్నట్టు కోర్టు పేర్కొన్నది. మరోవైపు, తాను మైనర్​నని చెప్పుకున్న ధర్మరాజ్ రాజేశ్​ కశ్యప్​కు కోర్టు ఆదేశాలతో పోలీసులు బోన్ అసిఫికేషన్ టెస్ట్ చేయించారు. ఈ టెస్ట్ రిపోర్టులలో కశ్యప్ మైనర్ కాదని తేలింది. దీంతో ఇద్దరినీ కస్టడీకి తరలించారు. కాగా, నిందితులనుంచి పోలీసులు రెండు తుపాకులు, 28 లైవ్​ బుల్లెట్స్​ను స్వాధీనం చేసుకున్నారు. షూటర్లకు సహాయం అందించిన వారిని గుర్తించేందుకు మొత్తం 15  పోలీసు బృందాలను రంగంలోకి దించారు.