గాల్లో రెండు విమానాలు ఢీ.. దెబ్బకు తునాతునకలైన చిన్న విమానం

కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్‌పై గాలిలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటన మంగళవారం(మార్చి 4) మధ్యాహ్న సమయంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో విమానంలో ప్రయాణిస్తున్న 44 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

ఏం జరిగిందంటే..?

సఫారిలింక్ ఏవియేషన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 'డాష్ 8' విమానం విల్సన్ ఎయిర్‌పోర్టు నుంచి ఐదుగురు సిబ్బంది సహా 44 మంది ప్రయాణికులతో రిసార్ట్ పట్టణం డయాకు బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే డాష్ 8 విమానంలో పెద్ద శబ్దాలు రావడంతో ముందుజాగ్రత్త చర్యగా తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా తిరిగి వచ్చే సమయంలో డాష్ 8.. చిన్న పాటి శిక్షణ విమానం సింగిల్-ఇంజిన్ సెస్నా 172ని ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో శిక్షణా విమానం నైరోబీ నేషనల్ పార్క్‌లో కూలిపోయింది. అందులోని పైలట్, ట్రైనర్ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. డాష్ 8 దెబ్బతిన్నప్పటికీ, సురక్షితంగా విల్సన్ విమానాశ్రయానికి తిరిగి చేరుకుంది. ఈ ఘటనపై అధికారులు ధర్యాప్తు ప్రారంభించారు.