- సెకండ్ల తేడాతో పైలట్ సేఫ్
- అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
లాస్ ఏంజెలెస్: రైలు పట్టాలపై క్రాష్ ల్యాండ్ అయింది విమానం.. తలకు దెబ్బలు తగిలి.. అందులోనే చిక్కుకుపోయాడు పైలట్.. ఎదురుగా రైలు వేగంగా దూసుకువస్తోంది. సడెన్ బ్రేక్ వేస్తే.. పెనుప్రమాదమే. ట్రైన్ ఆగదు, అతడు బయటికి రాలేడు.. ఇంతలోనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. ఉన్నది కొన్ని క్షణాలే. విమానంలో ఇరుక్కుపోయిన పైలట్‌ను బయటికి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. ఒక్క క్షణం.. పైలట్‌ను విమానం నుంచి విడిపించి నాలుగు అడుగులు పక్కకి వచ్చారు. అంతే.. విమానాన్ని రైలు బలంగా ఢీకొట్టింది. తునాతునకలైంది విమానం. శిథిలాలు కొన్ని మీటర్లు ఎగిరిపడ్డాయి. అచ్చం సినిమాల్లో మాదిరే.. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరిగిందీ ఒళ్లు గగుర్పొడిచే ఘటన. పైలట్‌ను కాపడుతున్నప్పుడు పోలీసు పెట్టుకున్న బాడీ కెమెరాలో ఇందుకు సంబంధించిన విజువల్స్ రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల సాహసానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్యలు తలెత్తి పకోయిమా పరిసరాల్లో రైల్వే ట్రాక్‌పై క్రాష్ ల్యాండ్ అయిందని పోలీసులు చెప్పారు. పైలట్‌ను స్థానిక మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు.