వామన్​రావును చంపేందుకు 10 నెలల కిందే ప్లాన్

  • కదలికలపై నాలుగు నెలల క్రితం రెక్కీ
  • ఒంటరిగా దొరికించుకునేందుకు ఇంతకాలం వెయిటింగ్
  • ఈ నెల 17న పక్కాగా ప్లాన్​ చేసి మర్డర్
  • వామన్​రావు దంపతుల హత్య కేసులో పోలీసుల వెల్లడి
  • బిట్టు శ్రీనును అరెస్ట్ చేసినం: కరీంనగర్​ డీఐజీ ప్రమోద్
  • నిందితులను కస్టడీకి పిటిషన్
  • కోర్టు డ్యూటీల బహిష్కరణ.. నిందితుల తరఫున వాదించం: మంథని బార్ ​అసోసియేషన్​ తీర్మానం

పెద్దపల్లి, వెలుగు: లాయర్లు వామన్​రావు, నాగమణి దంపతులను హత్య చేసేందుకు నిందితులు పది నెలల కిందే ప్లాన్​ చేశారని.. నాలుగు నెలల కింద రెక్కీ చేశారని పోలీసులు వెల్లడించారు. నిందితులు బిట్టు శ్రీను, కుంట శ్రీను ఈ విషయాలను తమ విచారణలో అంగీకరించారని వివరించారు. వామన్​రావు తమను ఫైనాన్షియల్​గా దెబ్బతీశారని, అవమానించేలా అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆగ్రహంతోనే హత్య చేసినట్టుగా ఒప్పుకొన్నారని చెప్పారు. కరీంనగర్​ డీఐజీ ప్రమోద్​కుమార్​ సోమవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. కేసులో వేగంగా ఎంక్వైరీ చేస్తున్నామని.. ఫోరెన్సిక్, సైబర్​ ఎక్స్​పర్టుల సహాయంతో లోతుగా దర్యాప్తు జరపాల్సి ఉందని తెలిపారు. పెద్దపల్లి జెడ్పీ చైర్​పర్సన్​ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును నాలుగు రోజుల కిందే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సోమవారం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.

4 రోజులు విచారించి..

హైకోర్టు లాయర్లు వామన్​రావు, నాగమణి దంపతులను ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో నడిరోడ్డుపైనే నరికి చంపిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. ఆ మరునాడే మంథని మండలం గుంజపడుగు గ్రామానికి కుంట శ్రీను, అక్కపాక కుమార్ తోపాటు విలోచవరం గ్రామానికి చెందిన చిరంజీవిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులకు వెహికల్​తోపాటు ఆయుధాలు సమకూర్చాడని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్​ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 4 రోజులు విచారించాక సోమవారం బిట్టు శ్రీనును అరెస్ట్​ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. తమ విచారణలో వెల్లడైన వివరాలను, నిందితులు చెప్పిన విషయాలను మీడియాకు వివరించారు.

వామన్​రావు ఇబ్బంది పెడుతున్నాడని..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బిట్టు శ్రీను 2016 సంవత్సరం నుంచి మంథనిలో నడుస్తున్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ గా కొనసాగుతున్నాడు. ఈ ట్రస్టు అక్రమాలకు పాల్పడుతోందని, అవినీతి ద్వారా వచ్చిన డబ్బుతో ట్రస్టు నడుపుతున్నారని గట్టు వామన్​రావు పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ విషయంగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. ట్రస్టు ఆదాయంపై కంప్లైంట్లు చేయించారు. మంథనిలో చెత్త రవాణా కోసం 2015 నుంచి 2019 ఏప్రిల్ వరకు బిట్టు శ్రీను కాంట్రాక్టుపై ట్రాక్టర్​ను పెట్టాడు. దీనిపై నెలకు రూ.30 వేల ఇన్​కం వచ్చేది. అయితే వామన్​రావు 2019 మార్చిలో ఈ ట్రాక్టర్​ కాంట్రాక్టుపై గ్రామ పంచాయతీకి కంప్లైంట్​ చేశారు. వామన్​రావు ఒత్తిడి మేరకు పంచాయతీ ఆఫీసర్లు కాంట్రాక్టును రద్దు చేశారు. దీన్ని వామన్​రావు బిట్టు శ్రీనుపై సాధించిన విజయంగా మంథని ప్రాంతంలో, సోషల్​ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో వామన్​రావుపై బిట్టు శ్రీను విపరీతంగా ఆగ్రహం పెంచుకున్నాడు.

కుంట శ్రీను దోస్తీతో..

బిట్టు శ్రీనుకు, కుంట శ్రీనుకు ఆరేండ్ల కింద పరిచయమై.. బాగా సన్నిహితులుగా మారారు. ఇదే క్రమంలో చిరంజీవి కూడా వారికి తోడయ్యాడు. ఈ క్రమంలో వామన్ రావు ఓ ఫోన్​ కాల్  విషయంగా హైదరాబాద్​లో కుంట శ్రీనుపై కేసు పెట్టించాడు. దానితోపాటు గుంజపడుగ గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి, కుంట శ్రీను కట్టుకుంటున్న ఇంటికి పర్మిషన్లు లేవని వామన్​రావు కంప్లైంట్లు చేశారు. అధికారులు కుంట శ్రీను ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కుంట శ్రీను కూడా వామన్​రావుపై కక్ష పెంచుకున్నాడు. కుంట శ్రీను, బిట్టు శ్రీను ఇద్దరూ కలిసి 10 నెలల కిందే వామన్​రావును చంపేయడానికి ప్లాన్​ చేసుకున్నారు. మర్డర్​ ఎలా చేయాలన్నది నిర్ణయించుకున్నారు. ఇందుకోసం బిట్టు శ్రీను రెండు కత్తులు చేయించి చిరంజీవి ఇంట్లో పెట్టాడు. నాలుగు నెలల కింద వామన్ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు రాగా.. చిరంజీవి వారిని చూసి బిట్టు శ్రీను, కుంట శ్రీనులకు ఇన్ఫర్మేషన్​ ఇచ్చాడు. అయితే వారు మంథనికి వచ్చేలోపు వామన్ రావు గుంజపడుగకు వెళ్లాడు. దాంతో వారు గుంజపడుగకు వెళ్లి వామన్ రావును చంపేందుకు రెక్కీ చేశారు. కానీ జనం ఎక్కువగా ఉండటంతో ఊరుకున్నారు.

కస్టడీకి ఇవ్వండి.. కోర్టులో పోలీసుల పిటిషన్

కేసు దర్యాప్తులో అవసరమైన విషయాలను రాబట్టేందుకు కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్​లను వారం పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు సోమవారం మంథని కోర్టులో పిటిషన్​ వేశారు. దీనిపై మంథని కోర్టు ఎలాంటి
నిర్ణయం తీసుకోలేదు.

మంథని మున్సిపాలిటీలో విచారణ

వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి మంథని మున్సిపాలిటీలో పోలీసులు సోమవారం ఎంక్వైరీ చేశారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్​ పుట్ట మధు భార్య శైలజ మంథని మున్సిపల్​చైర్​పర్సన్​గా పనిచేస్తున్నారు. లాయర్ల హత్య కేసులో పోలీసులు ఇప్పటికే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును అదువులోకి తీసుకొన్న నేపథ్యంలో.. మున్సిపాలిటీలో ఎంక్వైరీ చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా గతంలో లాయర్​ వామన్ రావు మంథని మున్సిపాలిటీ విషయంగా ఏవైనా కేసులు వేశారా అని ఆరా తీసినట్టు తెలిసింది. పుట్ట శైలజ ఎలక్షన్​అఫిడవిట్​పై గతంలో వామన్ రావు కేసు వేసినట్టు తెలిసింది. ఇక మున్సిపాలిటీలో బిట్టు శ్రీనుకు సంబంధించి ఒక ట్రాక్టర్​ లీజుకు నడుస్తోందని.. దానికి చెల్లించిన బిల్లుల డేటాను పోలీసులు సేకరించినట్టు సమాచారం.

కోర్టుకొచ్చారని తెలుసుకుని

వామన్ రావు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని నిందితులు వేచి చూస్తూ వచ్చారు. ఈ నెల 17న వామన్ రావు దంపతులు మంథని కోర్టుకు వచ్చారని తెలియడంతో కుంట శ్రీను, బిట్టు శ్రీను అలర్టయ్ యారు. కోర్టు దగ్గర ఉన్న కుంట లచ్చయ్యకు ఫోన్ చేసి కన్ఫర్మ్​ చేసుకున్నారు . వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి కత్తులు తీసుకొని రమ్మన్నారు . బిట్టు శ్రీను మంథని బస్ స్టాప్ దగ్గర చిరంజీవికి తన కారును ఇచ్చాడు . చిరంజీవి, కుంట శ్రీను మర్డర్​ ప్లాన్ చేసుకున్న చోటికి ఆ కారులో వెళ్లారు . వామన్ రావు, నాగమణిలను హత్య చేశాక.. బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి చెప్పారు. అతను మహారాష్ట్రకు వెళ్లిపోమ్మని చెప్పడంతో పారిపోయారు.

మార్చి 1 వరకు మంథని లాయర్ల విధుల బహిష్కరణ

లాయర్లు వామన్​రావు, నాగమణిల హత్యతోపాటు రామగుండం సీపీ సత్యనారాయణ చేసిన కామెంట్లపై మంథని బార్​ అసోషియేషన్​ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం లాయర్లు ఎమర్జెన్సీ మీటింగ్​ నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. మార్చి 1 వరకు మంథని కోర్టులో డ్యూటీలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని మిగతా బార్​ అసోసియేషన్లు సైతం సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. లాయర్లను ఉద్దేశించి రామగుండం సీపీ చేసిన అభ్యంతరకర కామెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరాలని తీర్మానించారు. నిందితుల తరఫున మంథని బార్​ అసోషియేషన్​ మెంబర్లు ఎవరూ వాదించరాదని, ఇతర బార్​ అసోసియేషన్లు సైతం సహకరించాలని తీర్మానం చేశారు. మృతుల కుటుంబాలకు వీలైనంత సహాయం అందించడంతోపాటు ఫాస్ట్​ట్రాక్​ కోర్టు ఏర్పాటు చేసి వేగంగా విచారించాలని డిమాండ్​ చేశారు.

సమగ్ర దర్యాప్తు జరుగుతోంది

‘‘లాయర్ల హత్య కేసులో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నం. ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొందరు సాక్షులను విచారించి స్టేట్ మెంట్​ తీసుకోవాల్సి ఉంది. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకొని వివరాలు రాబడుతం. ఫోరెన్సిక్ ల్యాబ్, సైబర్ క్రైమ్ ఎక్స్​పర్టులను విచారణ సహాయకులుగా తీసుకుని ముందుకెళ్తం. రామగుండం అడిషనల్ డీసీపీ అశోక్ కుమార్  సమగ్ర విచారణ చేస్తున్నారు. సాక్ష్యాలుగానీ, హత్యకు సంబంధించిన వీడియోలు గానీ అందజేస్తే.. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తం. – ప్రమోద్​కుమార్, కరీంనగర్​ డీఐజీ

ఇవి కూడా చదవండి 

లాయ‌ర్ కారును వెంటాడి ఢీకొట్టిన లారీ.. 500 మీటర్ల దూరం వ‌ర‌కు లాక్కెళ్లింది

మన హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్

పతంజలి కొరొనిల్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్న WHO