ఎన్నికల విధానంపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆయన.. మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వానికి ప్రజాబలం, దైవ బలం ఉందన్న వినోద్ కుమార్... సంక్షేమ అభివృద్ధిలో భాగంగానే రాష్ట్రంలోని దేవాలయాలను కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని చెప్పారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేశారన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి కూడా కట్టుబడి పనిచేస్తున్నామని, ఆలయ విస్తరణకు, చేయవలసిన పనులన్నీ ముందుకు సాగుతున్నాయని తెలిపారు. చెరువును పూడ్చి వేయాల్సి ఉన్నందున దాని సామర్థ్యం పెరిగాకే పూర్తిస్థాయి పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సమీక్షిస్తారన్నారు.
దక్షిణ కాశీగా పేరు పొందిన ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా వినోద్ కుమార్ చెప్పారు. ఆలయాన్ని యథావిధిగా కొనసాగుతూ అభివృద్ధిని చేస్తామని చెప్పారు.బీఆర్ఎస్ కు మునుగోడులో గతంలో కంటే 25 వేల ఓట్లు అధికంగా వచ్చాయన్న వినోద్ కుమార్.. కాంగ్రెస్ పార్టీ ఓట్లు కోల్పోయిందని విమర్శించారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ కు కనీసం డిపాజిట్ వస్తే నేను గెలిచేవాడినని, దేశంలో 32 శాతం ఓట్లు వచ్చిన బీజేపీ పార్టీ తరపున ప్రధాని మోడీ పరిపాలిస్తున్నాడని చెప్పారు. 62% ఓట్లు తిరస్కరింపచబడిన ఇక్కడ ఎన్నికల విధానం ఎలా ఉందని ప్రశ్నించిన ఆయన.. ఇతర దేశాల్లో పార్టీకి పడే ఓట్ల ఆధారంగా అక్కడ అభ్యర్థులు ఎన్నికవుతారన్నారు. రాబోయే కొత్త తరానికి ఎన్నికల విధానంపై సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇతర దేశాలలాగా పార్టీకి బడే ఓట్లను బట్టి అభ్యర్థులు పరిపాలించే స్థాయికి చేరాలని కోరారు. ఈ క్రమంలోనే ఎన్నికల విధానంపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉందని, మేధావులు కూడా ఈ విషయంపై చర్చించాలని డిమాండ్ చేశారు.