చెత్త డిస్పోజల్ కు ప్రణాళికలు రూపొందించాలి

చెత్త డిస్పోజల్ కు ప్రణాళికలు రూపొందించాలి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు : డంపింగ్ యార్డ్ వద్ద చెత్త డిస్పోజల్ కు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఆయన పర్యటించారు. 1వ డివిజన్ టీఎన్​జీవో కాలనీలో టీయూఎఫ్​ఐడీసీ నిధులు రూ.1.15కోట్లతో చేపట్టిన డంపింగ్ యార్డు అప్రోచ్, ఇంటర్నల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయ్ బాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంపై మున్సిపల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రోడ్డు సౌకర్యం ఉండేలా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఖమ్మం ఆర్డీవో గణేశ్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సీహెచ్. స్వామి, కార్పొరేటర్ తేజావత్ హుస్సేన్  పాల్గొన్నారు.

ప్రతి హామీ అమలు చేస్తాం

ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన ఆయన  సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయ్ బాబుతో లబ్ధిదారులకు సీఎంఆర్, కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. 

భూ సమస్యలు పరిష్కరించండి

కల్లూరు :  సత్తుపల్లినియోజకవర్గంలోని న్యాయమైన భూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్డీవో రాజేంద్ర గౌడ్, కల్లూరు, పెనుబల్లి మండలాల తహసీల్దార్లకు మంత్రి పొంగులేటతి సూచించారు. మంత్రి  తన స్వగ్రామం నారాయణపురం, కల్లూరు లో  పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఆయన రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, అగ్రికల్చర్​  తదితర శాఖల అధికారులతో భూ సమస్యలు, ఆరోగ్య సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, తదితర అంశాలపై సమీక్షించారు. కల్లూరు, పెనుబల్లి మండలాల పరిధిలోని పలు గ్రామాల రైతులు భూ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను  మంత్రి ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనులు స్పీడప్​ చేయాలని సూచించారు. కొత్త నారాయణపురం చెరువు కట్ట సమీపంలో బీరప్ప ఆలయ నిర్మాణానికి విరాళంగా  ప్రకటించి రూ.5 లక్షల్లో బుధవారం రూ.3 లక్షలను అందజేశారు. అనంతరం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్, ఆర్డీవో రాజేంద్ర గౌడ్, తహసీల్దార్లు, నాయకులు పాల్గొన్నారు.