ఉద్యమంలా మొక్కలు నాటితేనే దేశానికి ఊపిరి

పురాతన కాలం నుంచి ప్రకృతిని ప్రేమించి, పూజించే సంస్కృతి ఉన్న దేశం మనది. ‘కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితె అమ్మరా.. ఆదికే ఇది పాదురా కాదంటె ఏదీ లేదురా..”అని కవి అందెశ్రీ అన్నట్లు.. చెట్టులోనూ దైవత్వం చూసే ధర్మం మనది. మనిషి పుట్టినప్పటి నుంచి మొదలు చనిపోయి కట్టె కాలే వరకు కూడా చెట్టుతో ఉన్న రుణం తీరనది. మనుషులతోపాటు జీవకోటి మనుగడకు మొక్కలు, చెట్లు అవసరం. మన వేదాలు, పురాణాలు కూడా వృక్షసంపదను రక్షించాలని, వృక్షో రక్షతి రక్షితః అని చెబుతున్నాయి. అయితే జనాభా పెరుగుతున్న కొద్దీ గ్రామాలు, పట్టణీకరణ విస్తరించి అడవుల నరికివేత పెరుగుతోంది. ఫలితంగా కర్బన ఉద్గారాల వల్ల కాలుష్యం పెరిగి వాతావరణంలో భారీమార్పులు జరుగుతున్నాయి. భూమి, సముద్ర ఉష్ణోగ్రతల్లోను అంతేస్థాయిలో మార్పులు వస్తున్నాయి. దేశంలో తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షం కురిసి అతివృష్టికి దారితీస్తోంది. లేదంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అనావృష్టి ఏర్పడుతోంది. కరోనా సెకండ్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారతదేశంలో చాలా మంది ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల రూపాయిలు ఖర్చు పెట్టి ఆప్తులను బతికించుకుందామని అనుకున్నా, ఆక్సిజన్ దొరకకపోవడంతో తమ వారి ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయారు. చెట్లను పెంచడం, వాటి నరికివేతను ఆపడం, అడవుల నరికివేతను అరికట్టడం వల్ల గాలిలో సహజంగా ఆక్సిజన్ లభిస్తుందని చెబుతూ కరోనా టైమ్​లో కనిపించిన ఆక్సిజన్ కొరతను పర్యావరణవేత్తలు ఉదాహరణగా పేర్కొన్నారు. 

ప్రకృతి రక్షణ

చిన్న అవసరాలు తీర్చడం నుంచి, ఆహారం, పశుగ్రాసం, వైద్యానికి పనికొచ్చే మొక్కలు, వంటచెరుకు లాంటివాటికి తరగని వనరులుగా ఉన్న అడవులు లక్షలాది మందికి జీవనాధారం. ఇవి కార్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాహకాలుగా పనిచేస్తున్నాయి. అటవీ నిర్మూలన, అడవుల్లో జీవవైవిధ్యాన్ని దిగజార్చే ఏ చర్య అయినా కార్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్గారాలకు కారణం అవుతోంది. వాతావరణ మార్పును నిరోధించాలంటే, అడవులను కాపాడుకోవడం, మరిన్ని చెట్లు పెంచి అడవులను సృష్టించడం తప్పనిసరి. ఏకాత్మ మానవ దర్శనం తత్వాన్ని ప్రబోధించిన పండిట్ దీనదయాళ్​ ఉపాధ్యాయ ప్రకృతిని ఆర్థిక అవసరాల కోసం నాశనం చేయకూడదని, ప్రకృతి స్వయంగా తిరిగి పూరించుకోగలిగినంత మాత్రమే మనం ప్రకృతి నుంచి తీసుకోవాలన్నారు. ఆర్థికాభివృద్ధి లక్ష్యం మానవత్వం వృద్ధియే అని పేర్కొన్నారు. మనకు పూర్తిగా ప్రకృతిని నాశనం చేసే హక్కు లేదు. కావున మానవత్వంతో అన్ని జీవరాశులపై దయతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆయన స్ఫూర్తితో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఏర్పాటు చేసిన స్టూడెంట్ ఫోరం ఫర్ డెవలప్​మెంట్ ప్రకృతి రక్షణకు నడుం బిగించింది. సమగ్ర, స్థిరమైన అభివృద్ధి నమూనాలు రూపొందించడంలో విద్యార్థులను పాల్గొనేట్లు చేసి దేశాభివృద్ధిలో, దేశ పునర్​నిర్మాణంలో భాగస్వాములను చేస్తోంది. నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వాడకంపై నిషేధం, ప్లాస్టిక్ రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ, భూతాపం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తోంది. రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికులు, గల్ఫ్ కార్మికులు, సంచార జాతుల స్థితి, ఫ్లోరోసిస్ బాధితుల వివరాలపై సర్వే నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తోంది. 

వృక్షమిత్ర అభియాన్​

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఆజాది కా అమృత్​మహోత్సవాల్లో భాగంగా స్టూడెంట్ ఫర్ డెవలప్​మెంట్ ఫోరం మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘వృక్ష మిత్ర’అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతూ..  ప్రతి విద్యార్థి మొక్కలు నాటి సంరక్షించేలా కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్న స్టూడెంట్స్​sfdindia.org/mission-plantation-register-form లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక వృక్ష మిత్రుడు 10 మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి. ఇలా నేటి బాలలు, విద్యార్థుల్లో పర్యావరణ హిత, ప్రకృతితో మమేకమై జీవించే విధానం అలవరుస్తోంది. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలతోపాటు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి విద్యార్థి వృక్ష మిత్రగా చేరి10 మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తే, ఇలా దేశవ్యాప్తంగా ఉద్యమంలా మొక్కల పెంపకం జరిగితే.. భారత్​విప్లవాత్మకమైన మార్పు తీసుకువస్తుంది. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. ఈ పర్యావరణ ఉద్యమంలో ప్రతి స్టూడెంట్​భాగస్వామి కావాలి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల స్ఫూర్తితో దేశాన్ని ప్రకృతితో మమేకం చేద్దాం కలిసి రండి. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- శ్రీశైలం వీరమల్ల, ఓయూ రీసెర్చ్ స్కాలర్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు