ములుగు, వెలుగు : గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకోవడంతోపాటు మొక్కలు నాటి కాపాడుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. స్వచ్ఛదనం_పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం ములుగు మండలం అబ్బాపూర్ లో డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్ ఆధ్వర్యంలో కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజలతో కలిసి చెరువు గట్టున ఈత మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పచ్చదనం పరిశుభ్రత పై అవగాహన ర్యాలీలో పాల్గొని స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, అధికారులు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. అబ్బాపూర్ లో 300 మంది రైతులకు రుణమాఫీ లబ్ధి చేకూరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ లోపు రెండు లక్షల రుణమాఫీ పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు.
మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం..
సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ కోటి మందికి పైగా కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో ఉన్నారని మంత్రి సీతక్క వెల్లడించారు. త్వరలో సోలార్ పవర్ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్ముకునే విధంగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. ములుగులో త్వరలోనే మోడల్ మార్కెట్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం కలెక్టరేట్ లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.37.4 లక్షలు విలువ చేసే చెక్కులను 37 మంది లబ్ధిదారులకు అందజేశారు. గోవిందరావుపేట మండలం పస్రా ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో 141 గ్రామాలకు చెందిన బ్లాక్ ఫారెస్ట్ లోని తునికాకు సేకరణ లబ్ధిదారులకు బోనస్ గా రూ.1.55కోట్ల విలువ చెక్కును అందజేశారు.
కంటైనర్ ఆస్పత్రి ప్రారంభం..
వెంకటాపురం/ మంగపేట/ ఏటూరు నాగారం: సీజనల్ వ్యాధులపై ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. వాజేడు మండలం ఎడ్జర్లపల్లిలో కలెక్టర్చొరవతో జిల్లాలో రెండో కంటైనర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయగా, మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీఎంహెచ్వో అప్పయ్య, తదితరులు పాల్గొన్నారు. కాగా, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో స్వచ్చదనం పచ్చదనంతోపాటు హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభం, లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు.