- గోల్డెన్ టెంపుల్లో శిక్షను అనుభవించిన
- సుఖ్బీర్ సింగ్ బాదల్
- సేవాదార్‌గా విధులు నిర్వహించిన అకాలీదళ్ పార్టీ నేత
- మతపరమైన శిక్షలు విధించిన సిక్కుల సంస్థ అకాల్ తఖ్త్
అమృత్ సర్: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో శిక్షను అనుభవించారు. సేవాదార్ గా విధులు నిర్వహించారు. సిక్కుల తాత్కాలిక మతపరమైన సంస్థ అకాల్ తఖ్త్ ఆయనకు పలు మతపరమైన శిక్షలు విధించింది. అందులో భాగంగానే మంగళవారం ఉదయం వీల్ చైర్లో గోల్డెన్ టెంపుల్ కు వచ్చిన ఆయన ఎంట్రీ వద్ద మెడలో పలకను ధరించి, చేతిలో ఈటెను పట్టుకుని సేవాదార్ శిక్షను అనుభవించారు. పార్టీ సీనియర్ నేత బిక్రమ్ సింగ్ మజీతియా కూడా శిక్షను పూర్తి చేశారు. పార్టీ నాయకులతో కలిసి గోల్డెన్ టెంపుల్ లో పాత్రలు శుభ్రం చేయడంతో పాటు బాత్రూమ్లను కడిగారు.
సుఖ్బీర్ సింగ్ బాదల్ పై మతపరమైన ఆరోపణలు
శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 2007–2017 మధ్య కాలంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా పలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు అకాల్ తఖ్త్ పేర్కొంది. డేరాసచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు 2015లో అనుకూలంగా వ్యవహరించారని వెల్లడించింది. సుఖ్ బీర్ సింగ్ ను దోషిగా తేల్చింది. దీంతో తాను చేసిన తప్పులను అంగీకరించిన సుఖ్ బీర్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనకు గోల్డెన్ టెంపుల్ లో పాత్రలు శుభ్రం చేయడంతో పాటు బాత్ రూమ్ లు కడగాలని అకాల్ తఖ్త్ ఆదేశించింది. ఆయన తండ్రి పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు గతంలో ఇచ్చిన బిరుదును కూడా ఉప సంహరించుకుంటున్నట్టు పేర్కొంది.