ప్లాస్టిక్ సంచుల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

ప్లాస్టిక్  సంచుల  తయారీ  కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
  •  10 ఫైర్​ఇంజిన్లతో 10 గంటలు కష్టపడ్డా మంటలు అదుపులోకి రాలే
  • చేతులెత్తేసిన ఫైర్​సిబ్బంది
  •  చుట్టుపక్కల కంపెనీలకు వ్యాపించకుండా జాగ్రత్తలు
  • భారీగా ప్లాస్టిక్, ముడి పదార్థాలు ఉండడంతో ఆగని మంటలు
  •  జీ+3 బిల్డింగ్ ​మొత్తం దగ్ధం.. 

జీడిమెట్ల, వెలుగు:జీడిమెట్ల ఇండస్ట్రియల్​ఎస్టేట్ దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్​వీ ఫ్యాబ్ ఇండస్ట్రీస్​ప్లాస్టిక్ సంచుల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడ జీ+3 బిల్డింగ్​లో కంపెనీ కొనసాగుతుండగా, సంచుల తయారీకి ఉపయోగించే ముడి సరుకులను స్టోర్​చేసిన మూడో అంతస్తులోని గోదాములో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఆ టైంలో కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 100 మంది కార్మికులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. 

సమాచారం అందుకున్న ఫైర్​సిబ్బంది అందుబాటులో ఉన్న ఫైర్​ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోగా, దట్టమైన పొగ ఆ ప్రాంతం మొత్తాన్ని వ్యాపించింది. చుట్టుపక్కల పరిశ్రమల యాజమాన్యాలతోపాటు స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన ఫైర్​సిబ్బంది జీడిమెట్లతోపాటు సికింద్రాబాద్, సనత్​నగర్, కూకట్​పల్లి నుంచి మొత్తం 10 ఫైర్ ఇంజిన్లను రప్పించారు. వాటితోపాటు వాటర్​బోర్డుకు చెందిన ట్యాంకర్లను, ప్రైవేట్​వాటర్ ట్యాంకర్లను దాదాపు 40కి పైగా తెప్పించారు. మధ్యాహ్నం 2 నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 10 గంటలు శ్రమించగా, మంటలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోయారు.

 లక్ష లీటర్ల నీటిని కొట్టినా మంటలు అదుపులోకి రాలేదు. కంపెనీలోని ప్లాస్టిక్​సంచులు, ముడి పదార్థాలు తగలబడుతూనే ఉన్నాయి. మంటలు దాదాపు 100 మీటర్ల ఎత్తుకు ఎగిసి పడ్డాయి. చీకటి పడ్డాక సహాయక చర్యలకు ఆటంకం ఎదురైంది. కంపెనీ నుంచి దాదాపు 200 మీటర్ల దూరం వరకు వేడి సెగ తాకుతుండడంతో ఫైర్​ఇంజిన్లను, క్రేన్​మెషీన్లను అక్కడి నుంచి దూరంగా తరలించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మరిన్ని ముడి సరుకులు ఉండడంతో మంటలు అదుపులోకి రాలేదు. చేసేదేమీ లేక ఫైర్, సహాయక సిబ్బంది చేతులెత్తేశారు. చుట్టు పక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్​చేశారు.