కరీంనగర్ లో ప్లాస్టిక్ నిషేధం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను వాడుతున్నా.. అమ్ముతున్నా .. అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నగరంలోని కాలువలు, డ్రైనేజీలు ప్లాస్టిక్ తో నిండిపోతుండడం విమర్శలకు నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తోంది.
సింగల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై నిషేధం కరీంనగర్ లో ఎక్కడా అమలు కాకపోవడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. నగరంలో అన్ని చోట్లా ప్లాస్టిక్ క్యారి బ్యాగులు దర్శనమిస్తున్నాయి. కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, టిఫిన్ సెంటర్లు, చికెన్ , మటన్ షాపుల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు నిషేధిత ప్లాస్టిక్ ను యధేచ్చగా ఉపయోగిస్తున్నారు. దీంతో నగరంలోని మురికి కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. దీంతో మురికి కాలువలు, డ్రైనేజీల్లో మురికినీటి సరఫరాకు అడ్డంకులు ఏర్పడి.. మురికి నీరంతా రోడ్లపైకి వస్తోంది.
అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల పశువులు, మేకలు చనిపోతున్నాయి. ప్లాస్టిక్ నిషేధం సరిగా అమలు కావడం లేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధం అమలును జిల్లా అధికారులు సీరియస్ గా తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జులై 1న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత అధికారులు కొన్ని రోజులు ప్లాస్టిక్ అమ్మకుండా హడావిడి చేశారు. ఆ తర్వాత మళ్లీ అంతా మామూలై పోయింది.
నిషేధిత ప్లాస్టిక్ వస్తువల జాబితాలో కవర్లు, ప్లాస్టిక్ స్టిక్స్ ఉండే ఇయర్ బడ్స్ , ప్లాస్టిక్ జెండాలు, ఐస్ క్రీం పుల్లలు, అలంకరణకు వాడే థర్మాకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, పోర్క్ లు, స్పూన్లు, కత్తులు, వేడి పదార్థాలు, స్వీట్ బాక్స్ లకు వాడే పల్చటి ప్లాస్టిక్ పేపర్లు, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, పీవీసీ బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు, క్యాండి స్టిక్స్ ఉన్నాయి.ఇవన్నీ బహిరంగంగా అమ్ముతున్నా ... అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు లేకుంటే బిజినెస్ నడవదంటున్నారు వ్యాపారులు. ఒకప్పుడు జనం కూరగాయలకు క్లాత్ బ్యాగులు తీసుకెళ్లేవాళ్లు. దుకాణాలకు వెళితే సరుకుల కోసం సంచులు వాడేవాళ్లు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఖాళీ సంచిని వెంట పట్టుకెళ్లేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్నింటికీ ప్లాస్టిక్ పైనే ఆధార పడుతున్నారు జనం. వ్యాపారస్తులు తమ లాభాలనే తప్ప పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం.. ప్రజలు కూడా యూజ్ అండ్ త్రో అలవాట్లతో ప్లాస్టిక్ వ్యర్థాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.