యాదగిరిగుట్టపై జూన్ 15 నుంచి ప్లాస్టిక్ నిషేధం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యాదగిరికొండపై ఈ నెల 15వ తేదీ నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఆదివారం కొండపైన ఆలయ ఆఫీసర్లతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కొండపైన వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపులకు వెళ్లి గుట్టను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చడానికి సహకరించాలని కోరారు. ఈ సందర్బంగా భాస్కర్​రావు మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నుంచి కొండపైన ప్లాస్టిక్ బాటిళ్లు,  ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు నిలిపివేయాలని దుకాణ యజమానులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నారు. వాటికి బదులుగా గ్లాస్ బాటిల్స్, పేపర్ కవర్స్ ఉపయోగించాలని సూచించామన్నారు. చైర్మన్ నరసింహమూర్తి, ఏఈవోలు గట్టు శ్రావణ్ కుమార్, గజవెల్లి రఘు, జూషెట్టి కృష్ణ గౌడ్, వేముల రామ్మోహన్, గజవెల్లి రమేశ్​ బాబు, సూపరింటెండెంట్ రాజన్ బాబు, ఇంజినీరింగ్ ఈఈ దయాకర్ రెడ్డి, డీఈ మహిపాల్ రెడ్డి, ఏఈ శ్రీనివాస్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఈఈ రామారావు, ఏఈ దోర్బల శంకర్ పాల్గొన్నారు.

ఆదివారం పోటెత్తిన భక్తులు

యాదాద్రి టెంపుల్​కు ఆదివారం భక్తులు పోటెత్తారు.  సమ్మర్ హాలీడేస్ ముగుస్తుండడం, సండే కావడంతో అధిక సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి నాలుగు గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర పట్టింది. కొండ కింద  కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపం, పార్కింగ్ ఏరియా.. కొండపైన  బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయాయి. ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు లక్షపుష్పార్చన నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మంటపంలో ఉత్సవమూర్తులను రకరకాల పూలతో అర్చించారు. ఆలయంలో నిర్వహించిన స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం 4,600 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.78,59,736 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయంతో అత్యధికంగా రూ.30,63,100, వీఐపీ టికెట్లతో రూ.16.05 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.10 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.6,77,550, ప్రధాన బుకింగ్ తో రూ.3,56,900, సత్యనారాయణస్వామి  వ్రతాలతో రూ.2,38,400, యాదరుషి నిలయం ద్వారా రూ.3,38,802, కల్యాణకట్ట ద్వారా రూ.2.30 లక్షలు, సువర్ణపుష్పార్చనతో రూ.1,44,316 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.

4వ తేదీ నుంచి స్థానిక భక్తులకు  ఉచిత బ్రేక్ దర్శనం.. 

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో నివసిస్తున్న ప్రజలకు ఈ నెల 4వ తేదీ నుంచి ఉచిత బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సూచన మేరకు.. ప్రతి మంగళవారం సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఉచిత బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. రద్దీకి అనుగుణంగా సమయాన్ని కూడా పెంచుతామన్నారు. స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చన్నారు. స్థానిక భక్తులకు ఇప్పటికే ప్రతి శనివారం ఉదయం ఉచిత దర్శనాలు కల్పిస్తున్నామని గుర్తుచేశారు. దీనితో పాటు అదనంగా ఇకపై  ప్రతి మంగళవారం సాయంత్రం అరగంట పాటు బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు.