- త్వరలో ఎమ్మారై, అంజియోగ్రామ్ సేవలు
- చికిత్స కోసం హైదరాబాద్ కు తగ్గిన రిఫరల్ కేసులు
- పేదలకు అందుతున్న కార్పొరేట్ వైద్యం
ఆదిలాబాద్, వెలుగు: ఒకప్పుడు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో వైద్య సేవలు అంతంత మాత్రమే. రిమ్స్ హాస్పిటల్ ఏర్పాటుతో కొంత మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ డాక్టర్ల నియామకాలు, స్పెషలిస్టు వైద్యులు లేక ఎమర్జెన్సీ కేసులన్నీ రిఫర్ చేయడం, ఇక్కడి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులకు వైద్యం అందించడం లేదనేఆరోపణలు వచ్చేవి. ఏడాది కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్పెషలిస్టు డాక్టర్ పోస్టులు భర్తీకి నోచుకోవడంతో పూర్తి స్థాయిలో సర్జరీలు చేస్తున్నారు. ప్లాస్టిక్, క్యాన్సర్, కార్డియో, న్యూరో సర్జరీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోనే చేస్తుండడంతో పేద రోగులకు ఊరట కలిగింది. గతంలో 300 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ కు చికిత్స కోసం వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్లమని చెబుతున్నారు.
అందుబాటులోకి సర్జరీ సేవలు..
రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి ఏడాది గడుస్తున్నా పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి రాలేదు. కేవలం పీడియాట్రిక్, యూరాలజీతోనే కొనసాగించారు. రెండు నెలల నుంచి క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరోసర్జరీ, కార్డియాలజీ, కీళ్లమార్పిడి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 35 క్యానర్స్ ఆపరేషన్లు, 305 పీడియాట్రిక్ సర్జరీలు, 13 ప్లాస్టిక్ సర్జరీలు, 50 న్యూరో సర్జరీలు, 10 కీళ్లమార్పిడి, 807 యూరాలజీ సర్జరీలు చేశారు. ఈ సర్జరీలన్నింటికీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలంటే రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
త్వరలో ఎమ్మారై, అంజియోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సర్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ. 24.25 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. కంప్లీకేట్ కేసులు, పాయిజన్, యాక్సిడెంట్, స్నేక్ బైట్ వంటి వాటి కోసం ప్రత్యేక వైద్యులు, టీమ్లు, పరికరాలు అందుబాటులో ఉంటాయి. 14 డయాలసిస్ మెషీన్లను త్వరలో ప్రారంభించనున్నారు. అలాగే కార్డియో థొరిసిస్, నెఫ్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రాలజీ, న్యూరోలజీకి సంబంధించిన స్పెషలిస్టు డాక్టర్ల కోసం త్వరలో ఇంటర్వ్యూలు చేపటనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ నాలుగు సేవలు అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఉండదు..
ప్రస్తుతం రిమ్స్ సూపర్ స్పెషాటీలో అధునాతనమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, కార్డియాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వైద్యం కోసం గతంలో హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేది. లక్షల్లో ఖర్చు అయ్యేది. రిమ్స్ లో ఇప్పుడు ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నాం. త్వరలో ఎమ్మారై, అంజియోగ్రామ్, క్రిటికల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. - జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్
ఈ ఫోటోలో డాక్టర్లు పరీక్షిస్తున్న పేషంట్ పేరు దుర్గయ్య. గుడిహత్నూర్ మండలానికి చెందిన ఆయన నాలుగు రోజుల కింద బైక్ పై నుంచి పడటంతో బైక్ స్టాండ్ కాలిగి గుచ్చుకొని నరం తెగిపోయింది. దీంతో వైద్యం కోసం రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. డాక్టర్లు పరీక్షించి సర్జరీ చేసి తొడ దగ్గర మాంసాన్ని పాదం వద్ద అతికించారు. ఈ సేవలు రెండు నెలల కింద అందుబాటులోకి రావడంతో పేషెంట్ కు హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం రాలేదు. హైదరాబాద్ కు వెళ్లి ఉంటే రూ. లక్షకు పైగా ఖర్చయ్యేది, కానీ ఇక్కడ ఉచితంగా సర్జరీ చేశారు. గతంలో ఎంతో మందిని రిమ్స్ నుంచి మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు రిఫర్ చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.