
ఆంధ్ర ప్రదేశ్లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఇకపై కనిపించవు. కేవలం బట్టలతో చేసిన ఫ్లెక్సీలు మాత్రమే అనుమతి ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. ఆర్థిక పురోగతి సాధించాలని సూచించిన ఆయన.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని చెప్పారు. విశాఖ పట్టణంలో ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఎంఓయూ కుదిరిన సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్... ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ తొలి అడుగుగా అభివర్ణించారు. 2027కల్లా ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ గా మారుస్తామని ప్రకటించారు.
విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగిందని, దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్ ను సముద్ర తీరం నుంచి తొలగించారని చెప్పారు. సముద్రాన్ని, ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదీ అని వెల్లడించారు. పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుందని, రీ సైకిల్ చేసి పలు ఉత్పత్తులను తయారు చేస్తుందన్నారు. పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.