- జీవితాలకు కొత్త రూపం
- ‘బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్’ ఆధ్వర్యంలో ప్లాస్టిక్సర్జరీలు
- మియాపూర్లో 30 మంది.. పేదలకు చేయిస్తున్న ఎన్జీఓ
- ఇప్పటి వరకు దేశంలో 260 సర్జరీలు
- సైకలాజికల్, సూసైడ్ కౌన్సిలింగ్‌తో మనో ధైర్యం
‘‘విజయవాడకు చెందిన వనజ వయస్సు 29 ఏండ్లు.. ఈమె తన 6వ యేట అగ్ని ప్రమాదానికి గురైంది. ఈమె మెడ, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెడను ఎటూ తిప్పలేకపోయేది. ముఖం అందవికారంగా మారడంతో మొదట్లో ఇబ్బందిగా ఫీలయ్యేది. అయినప్పటికీ వెనకాడకుండా ఎన్నో ఇబ్బందులను ఎదర్కొని డిగ్రీ పూర్తి చేసింది. ఇప్పుడు కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మెడపై గాయాలతో ఎటూ తిప్పలేకపోతోంది. సర్జరీ చేయించాలంటే రూ. 5 లక్షలు అవసరమవుతాయని డాక్టర్లు చెప్పారు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు.’’
‘‘అఫ్జల్గంజ్కు చెందిన 39 ఏండ్ల సంతోశ్ 2017లో మంటల్లో చిక్కుకున్నాడు. ఛాతి, చేతులు తీవ్రంగా కాలిపోవడంతో పనిచేయకపోయాడు. దీంతో ఇన్నేండ్లు పని చేయలేదు. దీంతో వృద్ధులైన తల్లిదండ్రులపై ఆధారపడి బతుకుతున్నాడు. ఇల్లు గడవడం కష్టం కావడంతో ఏం చేయాలో అర్థం కాక కుంగిపోయాడు. ఇది తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ రూ. 4 లక్షలు ఖర్చయ్యే సర్జరీని ఫ్రీగా చేయించింది.
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రమాదవశాత్తు కొందరు, నిప్పంటించుకుని మరికొందరు, యాక్సిడెంట్లు, కరెంట్ షాక్, యాసిడ్ దాడుల వల్ల మరికొందరు శరీరం కాలిపోయి ముఖం మీద మరకలు, మచ్చలతో బతుకు వెళ్లదీస్తూ ఉంటారు. ఇందులో కొంతమంది ఆత్మనూన్యతా భావానికి లోనవుతుంటారు. తమను చూస్తున్న జనాలు ఏమనుకుంటున్నారనో అని, ఇక తమకి జీవితమే వద్దు అనే స్థితిలోకి వెళ్లిపోతుంటారు. అలా ఆత్మహత్య చేసుకున్నవారు కూడా చాలా మందే ఉన్నారు.
అయితే ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా అనుభవించిన ఓ మహిళ, తనలాంటి పరిస్థితి మరెవరికి రావొద్దని, శరీరం కాలిపోయిన వారికి ట్రీట్మెంట్కు ఆర్థిక స్థోమత లేని పేదలకు ‘బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్’ ఎన్జీఓతో నేనున్నానంటూ భరోసానిస్తోంది. కార్పొరేట్ హాస్పిటల్స్లో ప్లాస్టిక్ సర్జరీని ఉచితంగా చేయిస్తూ అండగా నిలుస్తోంది. సైకలాజికల్ గా, సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నవారికి కౌన్సిలింగ్ ఇస్తూ బతుకు మీద భరోసా కల్పిస్తోంది.
10 సంవత్సరాలుగా సేవలు
2009లో జరిగిన అగ్ని ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నిహారి మండలి అనే మహిళ శరీరం దాదాపు 55 శాతం కాలిపోయింది. కాలిన గాయాలతో అనుభవించిన బాధ, సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలన్న ప్రశ్నలతో కృంగిపోయి, మళ్లీ తేరుకొని, తనలాంటి వారికి ఒక దారి చూపించాలనే తపనతో ‘బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్’ ఎన్జీఓను 2014లో ప్రారంభించింది. ఈ పదేండ్లలో దేశంలోని పేదలకు 260 పైగా ప్లాస్టిక్ సర్జరీలు, 1,300 సైకలాజికల్ కౌన్సిలింగ్ లు, 300 లకు పైగా సూసైడ్ కౌన్సిలింగ్లు నిర్వహించింది. వారిలో మనోధైర్యాన్ని నింపింది.
30 మందికి ప్లాస్టిక్ సర్జరీ కోసం క్యాంప్
బుధవారం మియాపూర్‌లోని కాస్మో రేడియన్స్ హాస్పిటల్ లో 30 మందికి ప్లాస్టిక్ సర్జరీ కోసం పరీక్షలు నిర్వహించారు. ఈ క్యాంప్ పెగాస్ సిస్టమ్స్ సౌజన్యంతో నిర్వహిస్తున్నామని, పదిమందికి బుధవారం సర్జరీ చేశామని, మరో 20 మందికి కొద్ది రోజుల్లోనే దశల వారీగా సర్జరీలు చేస్తామని నిర్వాహకులు, డాక్టర్లు తెలిపారు. సంస్థ సభ్యులు, కాస్మోరేడియన్స్ హాస్పిటల్ నిర్వాహకులు, కాస్మొటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ప్రేమ్ సుందర్, అనస్తీషాలజిస్ట్ ఉదయ్ శ్రీ పాల్గొన్నారు.
నాలుగు గోడల మధ్యే ఉండకూడదని..
కాలిపోయిన శరీరాలతో నాలుగు గోడల మధ్య కుంగిపోకూడదని, ధైర్యంగా బయటకు వచ్చి తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించా. కాలిన శరీరానికి ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకోవాలో, సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ప్రీ, పోస్ట్ ట్రీట్ మెంట్ గురించి తెలియనివారు చాలా మంది ఉన్నారు. వారికి సరైన అవగాహన కలిగించడం, సర్జరీలు చేయించడం మా లక్ష్యం.
Also Read:-317 జీవో ఆరోగ్య శాఖ నుంచే అమలు..
నిహారి సంస్థ నిర్వాహకురాలు
తక్కువ ఫీజుతో ఎన్జీఓతో మమేకమై పనిచేస్తున్నాము
ఒక్క ప్లాస్టిక్ సర్జరీకి దాదాపు రూ.4 లక్షలకు పైనే ఖర్చవుతుంది. అలాంటి సర్జరీలను బీఎస్ఎంఎస్ సంస్థ సహకారంతో అతి తక్కువ ఫీజుకే చేస్తున్నాం. ఆ డబ్బులను ఎన్జీఓ దాతల సహకారంతో చెల్లిస్తోంది. సంస్థ చేసే సేవలకు ఎంతో కొంత తోడ్పడాలని మేము సర్జరీలు చేయడానికి ముందుకు వచ్చాం. భవిష్యత్తులో కూడా ఇదే సహకారం ఉంటుంది.
డాక్టర్ ప్రేమ్ సుందర్