సిడ్నీ: కొంతకాలంగా పేలవ ఫామ్‌లో ఉండి, ఆస్ట్రేలియా టూర్‌లో నిరాశ పరిచిన స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఇంకా సాధించాలనే తపన ఉందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అయితే ఈ ఇద్దరితో పాటు సీనియర్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడి, రెడ్ బాల్ క్రికెట్‌పై తమ ప్రేమ, నిబద్ధతను చాటుకోవాలని సూచించాడు. డొమెస్టిక్ క్రికెట్‌కు ప్రాముఖ్యత ఇవ్వకపోతే టెస్టులకు అవసరమైన క్రికెటర్లు లభించరని చెప్పాడు.
ఇక, కోహ్లీ, రోహిత్ ఫ్యూచర్ గురించి మాట్లాడేందుకు గంభీర్ నిరాకరించాడు. ‘నేను ఏ ఒక్క ఆటగాడి భవిష్యత్తు గురించి మాట్లాడలేను. ఎవరి కెరీర్ వారి ఇష్టం. నా వరకూ ఈ ఇద్దరిలో ఇంకా సాధించాలన్న తపన, ఆకలి ఉందని చెప్పగలను. ఇద్దరూ దృఢమైన వ్యక్తులు. ఇండియన్ క్రికెట్‌ను ఇంకా ముందుకు తీసుకెళ్లగలరు. వాళ్లు ఎలాంటి ప్రణాళికతో ఉన్నా.. అది దేశ క్రికెట్‌కు ప్రయోజనం చేసేలానే ఉంటుంది’ అని గౌతీ అభిప్రాయపడ్డాడు.
బుమ్రాతో మాట్లాడే హక్కు కాన్‌స్టస్‌కు లేదు
కోచ్‌గా జట్టులో సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేసేలా ఉంటానని గౌతీ పునరుద్ఘాటించాడు. ఫామ్ కోల్పోయినందున ఐదో టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్‌ను ప్రశంసించాడు. ‘ఒక కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకుంటే ఏ సమస్య లేదని భావిస్తున్నా. మేము జవాబుదారీతనం గురించి మాట్లాడాం. అది పై స్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచి మొదలవ్వాలి.. రోహిత్ శర్మ దాన్ని గత మ్యాచ్‌లో ప్రారంభించాడు’ అని తెలిపాడు.
ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఓపెనర్ కాన్‌స్టస్.. ఇండియా కెప్టెన్ బుమ్రాతో వాగ్వాదానికి దిగడం తప్పని గంభీర్ అన్నాడు. స్ట్రయికింగ్‌లో ఉన్న ఉస్మాన్ ఖవాజ టైమ్ వేస్ట్ చేస్తున్నప్పుడు కాన్‌స్టస్‌కు బమ్రాతో మాట్లాడే హక్కు లేదన్నాడు. ఈ విషయంపై స్పందించే బాధ్యత అంపైర్లదని, కాన్‌స్టస్ అనవసరంగా తలదూర్చి బుమ్రాతో గొడవ పడ్డాడని చెప్పాడు.