ఆర్‌సీబీ.. ఆర్‌సీబీ.. ప్రస్తుత ఐపీఎల్ టోర్నీలో ఈ జట్టు గురించే అతి పెద్ద చర్చ. అతి పెద్ద సమస్య. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట ఓడిన డుప్లెసిస్ సేన.. మరొక మ్యాచ్‌లో ఓడితే అనధికారంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. అదే వరుసగా రెండు ఓటములు ఎదురైతే.. అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగినట్లే. ఇప్పుడు సగటు క్రికెట్ అభిమాని నుంచి బీసీసీఐ పెద్దల వరకు అందరినీ కలవరపెడుతోన్న సమస్య ఇదే. అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగియున్న జట్లలో ఒకటైన బెంగళూరు టీమ్ మధ్యలోనే వైదొలిగితే టోర్నీయే కళ తప్పుతుంది.
ఓటమితో మొదలు
ప్రస్తుత 17వ ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆ తరువాత పుంజుకొని.. పంజాబ్ కింగ్స్ పై అధ్బుత విజయం సాధించింది. అంతే.. మళ్లీ గెలుపు రుచి చూసింది లేదు. ఆ తరువాత జరిగిన ఐదు మ్యాచ్(కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్)ల్లోనూ ఓటమిపాలైంది. ఈ పరాజయాలకు ఆటగాళ్ల ప్రదర్శన ఒక కారణమైతే.. ఇంగ్లీష్ సమస్య మరొక కారణమని భారత మాజీ దిగ్గజం, ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెలవిచ్చారు.
ఇంగ్లీష్ అర్థం కావడం లేదు
ఆర్‌సీబీ జట్టులో 12 నుంచి15 మంది భారతీయ ఆటగాళ్లు ఉంటే, విదేశీ ఆటగాళ్లు మరియు సిబ్బంది కలిపి ఓ 10 మంది ఉన్నారు. ఉన్న 15 మంది భారత ఆటగాళ్లలో ఐదారు మంది మాత్రమే అంతర్జాతీయ ఆటగాళ్లు.. మిగిలినవారందరూ దేశవాళీ క్రికెటర్లు. ఈ దేశవాళీ క్రికెటర్లకు.. విదేశీ క్రికెటర్లు, కోచ్‌లు మాట్లాడే ఇంగ్లీష్ అర్థం కావడం లేదట. పలితంగా, వారు తమ సమస్యను కెప్టెన్(డుప్లెసిస్)తోనూ.. సిబ్బంది(హెడ్ కోచ్: ఆండీ ఫ్లవర్, బౌలింగ్ కోచ్: ఆడమ్ గ్రిఫిత్)తోనూ పంచుకోలేకపోతున్నారట. ఇదే సెహ్వాగ్ చెప్తున్న కొత్త కారణం.
"జట్టులో ఎంత గొప్ప ఆటగాళ్లున్నా.. వారి మధ్య మంచి సమన్వయం, సౌలభ్యం అవసరం. అది ఆర్‌సీబీ జట్టులో కనిపించడం లేదు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ముందు ఆటగాళ్లు మౌనంగా ఉంటున్నారు.. ఎందుకంటే అతను ఏదైనా అడిగితే, వారు సమాధానం ఇవ్వాలి. జట్టులో భారత ఆటగాళ్లలో ఉన్న సగం మందికి ఇంగ్లీష్ అర్థం కాదు. అలాంటప్పుడు వారితో ఎవరు సమయం గడుపుతారు.. వారిని ఎలా ప్రేరేపిస్తారు? నాయకుడు భారతీయుడైతే, మనస్సులో ఉన్నది నిర్భయంగా బయటకు పంచుకోవచ్చు. అదే విదేశీ ఆటగాడికి అలా చెప్తే.. తదుపరి మ్యాచ్ ప్లేయింగ్ XI నుండి అతన్ని తప్పించవచ్చు." అని సెహ్వాగ్ ఆర్‌సీబీ ఓటములకు కొత్త కారణాన్ని వెల్లడించారు.
ఆర్‌సీబీ జట్టులో విదేశీయులు
- హెడ్ కోచ్: ఆండీ ఫ్లవర్
- బౌలింగ్ కోచ్: ఆడమ్ గ్రిఫిత్
- ఓవర్ సీస్ ప్లేయర్స్: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, రీస్ టోప్లీ, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్.