జాతర ముసుగులో పేకాట

  • ఆటకట్టించిన నిర్మల్ జిల్లా పోలీసులు

సారంగాపూర్, వెలుగు: మహారాష్ట్ర సరిహద్దులో జాతర ముసుగులో పేకాట ఆడుతుండగా నిర్మల్ జిల్లా పోలీసులు వెళ్లి ఆట కట్టించారు. సంక్రాంతిని పురస్కరించుకొని సారంగాపూర్ మండలం బండరేవు తండాలో నానూ మహారాజ్ జాతర మూడు రోజుల పాటు జరగనుండగా పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనా ఆధ్వర్యంలో గురువారం వెళ్లి దాడులు చేశారు. 

జాతరకు కొద్ది దూరంలో అనుమానం రాకుండా ఆట బొమ్మలు, వివిధ సామాన్లు అమ్మే షాపుల మాదిరిగా టెంట్లు వేసి పేకాట ఆడుతున్నారు. పోలీసుల రాకను చూసిన పేకాటరాయుళ్లు వెంటనే పారిపోయారు. మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పేకాటరాయుళ్లు ఆడేందుకు సిద్ధం కాగా.. పోలీసులు వెళ్లకపోతే రూ. కోట్లలో జూదం జరిగేదని సమాచారం.  జాతరలో పేకాట, జూదం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. జాతరను భక్తి భావంతో నిర్వహించుకోవాలని, గ్రామస్తులు కూడా జూదాన్ని ప్రోత్సహించవద్దని సూచించారు.