- సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ: లంచం, అవినీతి కేసులో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు మోపిన ఆరోపణల మీద విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అదానీ–హిండెన్ బర్గ్ కేసులో పిటిషన్ వేసిన అడ్వొకేట్ విశాల్ తివారీనే ఈ పిటిషన్ వేశారు. అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు మోపిన అభియోగాలు తీవ్రమైనవని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ అభియోగాలపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో అడ్వొకేట్ విజ్ఞప్తి చేశారు. అలాగే, అదానీ–హిండెన్ బర్గ్ కేసులో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇప్పటి వరకూ జరిపిన విచారణపై సమగ్ర నివేదిక ఇచ్చేలా ఆదేశించాలని కోరారు.
‘‘అదానీ–హిండెన్ బర్గ్ కేసులో సెబీ ఇప్పటివరకూ తాను చేసిన దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలి. మదుపర్ల విశ్వాసాన్ని కాపాడాలి” అని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 24 దర్యాప్తుల్లో 22 పూర్తి చేశామని సెబీ తెలిపింది. కాగా.. గౌతమ్ అదానీ, ఆయన సోదరుని కొడుకు సాగర్ అదానీ, అదానీ గ్రూప్ కు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్ లు మన దేశ రాజకీయ నాయకులకు అమెరికాలో పలు సంస్థలకు లంచాలు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది.