
- వివరాలివ్వని వాళ్లు సర్వేలో పాల్గొనాలి
- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: ఎవరు ఎంత మంది ఉన్నారో, వారికంత న్యాయం జరగాలని రాహుల్ గాంధీ చెప్పారని, ఆ ప్రకారమే కామారెడ్డి డిక్లరేషన్ కు మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కులగణనలో వివరాలు ఇచ్చేందుకు మరో అవకాశం ఇచ్చామని, గతంలో వివరాలు ఇవ్వని వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ నెల 28 వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఇందుకు టోల్ ఫ్రీ నంబర్ 040 21111111 ఏర్పాటు చేశామన్నారు. సర్వేలో పాల్గొనని వాళ్లు ఈ నంబర్ కు ఫోన్ చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు తీసుకుంటారని చెప్పారు. దీంతోపాటు ఎంపీడీవో ఆఫీస్ లు, వార్డ్ ఆఫీస్ లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలంటే https://seeepsurvey.cgg.gov .in ద్వారా సమాచారం ఇవ్వొచ్చని ఆయన సూచించారు.