ఆ బ్యాట్ వాడొద్దని ధోని చెప్పాడు.. అయినా నేను వినలేదు: మాథ్యూ హేడెన్

ఆ బ్యాట్ వాడొద్దని ధోని చెప్పాడు.. అయినా నేను వినలేదు: మాథ్యూ హేడెన్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ముంగూస్ బ్యాట్ అని పిలుచుకునే పొడవాటి హ్యాండిల్ మరియు చిన్నపాటి మందం కలిగిన బ్యాట్‌తో ఓపెనింగ్ చేసే హేడెన్ ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపించేవారు. ఎడా బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచేవారు. అయితే చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ సహా ఫ్రాంచైజీలోని చాలా మంది సభ్యులు తనను ముంగూస్ బ్యాట్‌ను ఉపయోగించవద్దని కోరినట్లు ఈ ఆసీస్ బ్యాటర్ వెల్లడించారు. 

ముంగూస్ బ్యాట్‌పై వివరణ ఇవ్వడం కష్టమన్న హేడెన్.. ఆటగాడి బ్యాటింగ్ శైలిని బట్టి బ్యాట్ రూపాంతరాన్ని ఎంచుకోవచ్చని తెలిపారు. "సగం బ్యాట్‌ను ఎలా ఉపయోగించగలరని చాలా మంది అడిగారు. అందులో ధోని ఒకరు. అతను చెప్పిన మాట నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. 'మేట్(మాథ్యూ) ఈ బ్యాట్‌ ఉపయోగించకూడదని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా.. కావాలంటే మీకు నేను  ఇస్తాను. దయచేసి ఈ బ్యాట్‌ని ఉపయోగించవద్దు.." అని ధోని అన్నారు. అందుకు నేను ధోనితో ఇలా అన్నాను.

"మిత్రమా(ధోని) నేను ఈ బ్యాట్‌తో సుమారు ఒకటిన్నర సంవత్సరం నుంచి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ నమ్మకంతో మీకు చెప్తున్నా. బంతి బ్యాట్ మధ్యలో తాకినప్పుడు సాధారణ బ్యాట్‌తో పోల్చితే 20మీ దూరం ఎక్కువ వెళ్తుంది. ఇది వాస్తవం. ఈ బ్యాట్‌తో బౌండరీలు సాధించడం చాలా సులభం.." అని చెప్పానని హేడెన్ వెల్లడించారు.

ఇక ధోనీకి విసుగు తెప్పించే విషయం ఏంటి? అనే ప్రశ్నకు.. నిర్లక్ష్యపు ఫీల్డింగ్ అని సమాధానమిచ్చారు. "బద్ధకంగా ఫీల్డింగ్ చేయడం ధోనికి ఏమాత్రం నచ్చదు. ఫీల్డింగ్‌లో నిర్లక్ష్యం చేస్తే  అతనికి పట్టరానంత కోపం వస్తుంది. అది మంచిది కాదు.." అని హేడెన్ చెప్పుకొచ్చారు. ఈఎస్‌పిఎన్‌తో మాట్లాడుతూ ఆసీస్ ఓపెనర్ ఈ వ్యాఖ్యలు చేశారు.