వయసు ఆధారంగా ముందస్తు బెయిల్‌‌ ఇవ్వండి

వయసు ఆధారంగా ముందస్తు బెయిల్‌‌ ఇవ్వండి
  • హైకోర్టులో పిటిషన్‌‌ వేసిన ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్‌‌రావు  

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసు ప్రధాన నిందితుడు ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్‌‌ టి ప్రభాకర్‌‌రావు హైకోర్టులో వ్యాజ్యాన్ని వేశారు. తాను 65 ఏండ్ల సీనియర్‌‌ సిటిజన్‌‌నని, తన హెల్త్ కండీషన్ చూసి ముందస్తు బెయిల్‌‌ ఇవ్వాలని హైకోర్టును కోరారు. 2004–10 మధ్యకాలంలో నాలుకపై ట్యూమర్‌‌ వచ్చి పలు ఆపరేషన్లు చేయించుకున్నట్లు చెప్పారు. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో పోలీసులు చార్జిషీట్‌‌ దాఖలు చేశారని, అందులోనే అన్ని విషయాలు ఉన్నాయని, తన నుంచి కొత్తగా  తెలుకోవాల్సిన వివరాలేమి లేవని చెప్పారు.  తాను ఇంతకాలం ఎక్కడికీ పారిపోలేదని, వైద్యం కోసం అమెరికా వెళ్లానని..దీనిపై కింది కోర్టులో మెమో కూడా దాఖలు చేశానని వివరించారు. ఇవే విషయాలను దర్యాప్తు అధికారికి కూడా తెలియజేశానని చెప్పారు. తాను అమెరికా వెళ్లాక దర్యాప్తు అధికారులు తన ఇంట్లో సోదాలు చేస్తే ఏ ఆధారాలు లభించలేదన్నారు. అరెస్టు అవుతాననే భయంతో తాను అమెరికా పారిపోయినట్లు దర్యాప్తు సంస్థ కింది కోర్టుకు చెప్పి నాన్‌‌ బెయిలబుల్‌‌ వారెంట్‌‌ ఆర్డర్‌‌ పొందిందన్నారు అమెరికాకు వైద్యం కోసం వెళ్లినట్లుగా తాను కోర్టులో మెమో దాఖలు చేసినట్లు వివరించారు.  రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అన్యాయంగా ఈ కేసులో తనను ఇరికించిందన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదని అన్నారు. ఎస్‌‌ఐబీ చీఫ్‌‌గా చట్టాలకు లోబడి పనిచేశానన్నారు. ఆనాటి అధికార పార్టీతో కుమ్మక్కై వేరే పార్టీ వాళ్ల ఫోన్లను ట్యాప్‌‌ చేయించానన్నది అసత్యమని వెల్లడించారు.  ఇప్పటికీ తాను దర్యాప్తునకు సహకరిస్తున్నాను కాబట్టి ముందస్తు బెయిల్‌‌ ఇవ్వాలని  హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో ప్రభాకర్‌‌రావు పేర్కొన్నారు.