మా పెన్షన్ కూడా పెంచండి

మా పెన్షన్ కూడా పెంచండి

1954  చట్టం ప్రకారం  పార్లమెంట్ సభ్యులకు జీతాలను, పెన్షన్లను ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నారు. కానీ,  సీనియర్ సిటిజన్స్​పై నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైల్వే రాయితీలను  పునరుద్ధరిస్తామని, ఇప్పటికే రైల్వే టికెట్లలలో ఎక్కువ రాయితీలు కల్పిస్తున్నామని  పలు సందర్భాల్లో తెలియజేస్తున్నారు.  అయితే, ఉద్యోగుల జీతభత్యాలు పెంచుటకు రకరకాల కమిటీలను వేసి  వాటి నివేదికలను పరిశీలించి పెంచుట సాధ్యం కాదనడం శోచనీయం. కనీసం కరువు భత్యం కూడా.. సమయానికి ఇవ్వడం లేదు.  

పార్లమెంట్ సభ్యులకు ఐదు సంవత్సరాల కాలపరిమితిలో వారికి అనుకూలంగా నియమ నిబంధనలను, చట్టాలను,  క్రమం తప్పకుండా అమలు చేస్తుంటారు. అయితే, ప్రజల కనీస అవసరాలుగానీ, ఉద్యోగుల ప్రయోజనాలుగానీ పట్టడం లేదు.  1998 బొగ్గు గనుల ప్రావిడెంట్ ఫండ్  చట్టాన్ని అమలు చేయుటలో శ్రద్ధ చూపడం లేదు.  ప్రతి మూడేళ్లకు ఒకసారి పెన్షన్ సమీక్ష చేసి పెంచుతామని పేర్కొని 27 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు  ఒక్కసారి కూడా పెన్షన్  పెంపుదల చేయలేదు.  

రాష్ట్రపతి, ప్రధాని,బొగ్గు గనుల శాఖ మంత్రి, బొగ్గు కార్యదర్శి,  కోల్ ఇండియా చైర్మన్  బొగ్గు గనుల ప్రావిడెండ్ కమిషనర్,  ప్రజాప్రతినిధులకు వివిధ వేదికలపై ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించినా అరణ్య రోదనే అవుతున్నది. పెద్దపల్లి, రాంటెక్ పార్లమెంట్ సభ్యులు ఇతర ఒకరిద్దరూ సభ్యులు మాత్రమే  బొగ్గు ఉద్యోగుల పెన్షన్ విషయంలో పార్లమెంట్ దృష్టికి తీసుకొనిపోయారు.  కాకా వెంకటస్వామి చొరవతో మొలసిన  పరిశ్రమల ఉద్యోగుల వరమైన పెన్షన్ మొక్క  కాల పరిస్థితులకు అనుగుణంగా  మహావృక్షంగా మార్చుటకు  గౌరవ పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ సహకరిస్తారని బొగ్గు ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

–దండంరాజు రాంచందర్ రావు-