- మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ఆందోళన
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మరోసారి పరిశీలించాలని మాల సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రకటించిన వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానికంగా ఆందోళన నిర్వహించారు.
ముందుగా కలెక్టర్ చౌక్ వరకు ర్యాలీగా వచ్చిన నాయకులు అక్కడ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను, వర్గీకరణ బిల్లు ప్రతిని దహనం చేయడానికి ప్రయత్నించారు. గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రిపోర్ట్‌ను యథాతథంగా ఆమోదించడాన్ని ఖండిస్తున్నామన్నారు.
వర్గీకరణ ఉపసంఘంలోగానీ, ఏకసభ్య కమిషన్‌లో గానీ మాలల ప్రతినిధులు లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకులు మేకల మల్లన్న, మెట్టు ప్రహ్లాద్, పాశం రాఘవేంద్ర, సుధీర్, ములకల రాజేశ్వర్, అశోక్, స్వామి, రాజేశ్వర్ పాల్గొన్నారు.