మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ .. మళ్లీ ప్రారంభించండి.. ప్లీజ్!

  • ఈజ్ మై ట్రిప్​కు ఆ దేశ ట్రావెల్ ఆపరేటర్ల సంఘం విజ్ఞప్తి
  • ఇండియన్లు మా సోదర, సోదరీమణులంటూ కామెంట్

న్యూఢిల్లీ: మాల్దీవులకు భారత్ నుంచి టూరిస్టుల బుకింగ్స్ బంద్ కావడం పట్ల ఆ దేశ ట్రావెల్ ఆపరేటర్ల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. తమను ఆదరించే సోదర, సోదరీమణులు ఇండియన్లేనని.. తమ టూరిజానికి వారే అత్యంత కీలకం అంటూ వేడుకోళ్లు ప్రారంభించింది. ప్రధాని మోదీపై, భారత్ పై మాల్దీవుల మంత్రుల అభ్యంతరకర కామెంట్ల నేపథ్యంలో తమ వెబ్ సైట్ లో మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ను రద్దు చేస్తున్నట్లు సోమవారం ఈజ్ మై ట్రిప్ కంపెనీ ప్రకటించింది. దీంతో మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ (మటాటో) మంగళవారం ఈజ్ మై ట్రిప్ సీఈవో నిశాంత్ పిట్టికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది. 

‘‘మాల్దీవుల మంత్రుల కామెంట్లపై విచారం వ్యక్తం చేస్తున్నాం. వారి కామెంట్లతో మాల్దీవుల ప్రజలకు సంబంధంలేదు. కరోనా సమయంలోనూ మాల్దీవులకు అత్యధికంగా ఇండియన్ టూరిస్టులే వచ్చారు. ఇండియన్ టూరిస్టుల వల్లే మా ఎకానమీ గ్రోత్ ఆధారపడి ఉంది” అని మటాటో పేర్కొంది. ఇండియా, మాల్దీవుల మధ్య ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్ షిప్, పార్ట్ నర్ షిప్ ఉన్నాయని.. తమను ఆదరించే సోదర, సోదరీమణులు ఇండియన్లే అని భావిస్తామని తెలిపింది. ‘‘మాల్దీవులకు టూరిజమే జీవనాధారం. దేశ జీడీపీలో మూడింట రెండొంతులు టూరిజంపైనే ఆధారపడి ఉంది. టూరిజం దెబ్బతింటే మా దేశ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతుంది” అని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది.