
హైదరాబాద్, వెలుగు : తనకు న్యాయం చేయాలని ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కోరుతున్నాడు. బాధితుడి కథనం ప్రకారం..ఒంగోలు జిల్లాకు చెందిన నూకతోటి పెదకొండయ్య 2008లో మల్లెపల్లి ఐటీఐ కాలేజీలో అసిస్టెంట్ ట్రైనింగ్ఆఫీసర్ గా చేరారు. 2014లో అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులైన 320 మంది అసిస్టెంట్ట్రైనింగ్ ఆఫీసర్లను ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిన కొనసాగిస్తూ జీవో రిలీజ్చేసింది. తర్వాత కూడా కొనసాగించి 2023లో పర్మినెంట్ చేసింది.
కానీ, మల్లెపల్లి కాలేజీలో నలుగురిని మాత్రం నాన్ లోకల్ అంటూ డ్యూటీకి రానివ్వలేదు. ఇందులో కొండయ్య కూడా ఉన్నాడు. దీంతో ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ లో కంప్లయింట్చేశారు. 2014 జూలై నుంచి 2015 జూన్ వరకు వరకు జీతాలు చెల్లించాలని కమిషన్ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు.
2015 జూన్ లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చెప్పినట్టు జీతాలు చెల్లించాలని ఆదేశించింది. అయితే, తనను కాకుండా మిగతా ముగ్గురిని పిలిపించుకుని వారితో ఏడాది కాలానికి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయించుకున్నారని, వారికి జీతాలు చెల్లించినా తాను మాత్రం డ్యూటీకి రాలేదని కోర్టుకు నివేదిక ఇచ్చారని బాధితుడు ఆరోపించాడు. మళ్లీ, కోర్టులో పిటిషన్ వేయగా, తనను కాలేజీ నుంచి పంపించి వేశారని చెప్పాడు. అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తన ఉద్యోగం, పెండింగ్ జీతాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నాడు.