ఎంపీడీవో టీఆర్ఎస్ సర్కారుకు తొత్తుగా మారిండు

  • బీజేపీ సర్పంచ్ ఏర్పాటు చేసిన ప్లెక్సీని తొలగించిన ఎంపీడీవో
  • ప్లెక్సీని తొలగించాల్సిన అవసరమేముందని ప్రశ్నించిన సర్పంచ్ 
  • దమ్ముంటే టీఆర్ఎస్ ప్లెక్సీలను తొలగించాలని ఎంపీడీవోకు సవాల్
  • ఎంపిడీవోపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు

నల్గొండ: మునుగోడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అన్ని పార్టీల నాయకులు ఎవరికీ వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా... మునుగోడు నియోజకవర్గంలోని ఓ సర్పంచ్, అక్కడి ఎంపీడీవోకు మధ్య ప్లెక్సీ విషయంలో వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మునుగోడు నియోజవర్గంలోని చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ సత్యం.. దసరా పండుగ సందర్భంగా గ్రామంలో ప్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే మునుగోడు ఎన్నికలో నేపథ్యంలో గ్రామానికి వచ్చిన ఎంపీడీవో తన సిబ్బందితో కలిసి ఆ ప్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు. అయితే ఆ గ్రామానికి వచ్చిన ఎంపీడీవో.. ఎన్నికల కోడ్ పేరుతో ప్లెక్సీ తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ సర్పంచ్ ఎంపీడీవోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామంలో బీజేపీ ప్లెక్సీని ఏర్పాటు చేస్తే తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటని ఆ అధికారిని నిలదీశారు. దీనికి స్పందించిన ఎంపీడీవో ఎన్నికల కోడ్ ప్రకారం ఎలాంటి ప్లెక్సీలు ఏర్పాటు చేయొద్దంటూ దాన్ని చించివేశారు.  

ప్రచారం కోసం వేరే ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు వస్తే లేని తప్పు.. తమ గ్రామంలో ప్లెక్సీని ఏర్పాటు చేస్తే వచ్చిందా అంటూ సర్పంచ్ ఎంపీడీవోను నిలదీశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బు సంచులతో మునుగోడు ప్రజలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, దమ్ముంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మనుగోడు నుంచి ఖాళీ చేయించాలని సవాల్ విసిరారు. ఎట్టి పరిస్థితుల్లో ప్లెక్సీని తొలగించేది లేదని సర్పంచ్  తేల్చి చెప్పారు. అయితే అవేమీ పట్టించుకోని ఆ అధికారి ఎన్నికల నిబంధనల పేరుతో తానే స్పయంగా ప్లెక్సీని తొలగించారు. దీంతో సర్పంచ్, ఎంపీడీవోకు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీల ప్లెక్సీలను కాదు... దమ్ముంటే టీఆర్ఎస్ ప్లెక్సీలను తొలగించాలని సర్పంచ్ సవాల్ చేశారు. ఎంపీడీవో అధికార పార్టీకి తొత్తులా మారిండని మండిపడ్డారు. ఎంపీడీవో వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని సదరు సర్పంచ్ చెప్పారు.