- ఈ నెల 11న మూడోసారి ఓపెన్ యాక్షన్
- గజం ధర రూ.5500కు తగ్గింపు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (సుడా) ఆధ్వర్యంలో పట్టణ శివారులోని మిట్టపల్లి వద్ద ఏర్పాటు చేసిన మెగా వెంచర్ లోని మిగులు ప్లాట్ల ఓపెన్ యాక్షన్ కు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రెండేళ్ల కింద అసైన్డ్ భూములను సేకరించి సుడా నిధులతో అభివృద్ధి చేసిన ఈ మెగా వెంచర్ లో మొత్తం111 ప్లాట్లు అమ్మకానికి పెడితే కేవలం 13 మాత్రమే అమ్ముడుపోయాయి.
గతేడాది కాలంలో రెండు సార్లు వేలం నిర్వహించినా ప్రజలు ఆసక్తి చూపక పోవడంతో 98 ప్లాట్లు మిగిలిపోయాయి. ఈ పరిస్థితుల్లో సుడా ప్లాట్ల అమ్మకంపై కలెక్టర్ సమీక్ష జరిపి ధరలు తగ్గించాలని సూచించడంతో మరోసారి ఓపెన్ యాక్షన్ కు అధికారులు సిద్ధమవుతున్నారు.
మెగా వెంచర్ తయారైంది ఇలా..
సిద్దిపేట పట్టణ శివార్లలోని మిట్టపల్లి వద్ద పేదలకు సంబంధించి 14 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించి సుడా మెగా వెంచర్ ను ఏర్పాటు చేసింది. ఇందులో రోడ్లు, పార్క్, డ్రైనేజీ లకు పోగా మిగిలిన స్థలంలో 161 ప్లాట్లు రెడీ చేసి వాటిలో 60 ప్లాట్లను అసైనీలకు ఇవ్వగా మిగిలిన వాటిని ఓపెన్ యాక్షన్ ద్వారా అమ్మాలని నిర్ణయించింది.
ఏడాదిన్నర కింద రెండుసార్లు ఓపెన్ యాక్షన్ నిర్వహించగా 111 ప్లాట్లకు 50 అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో 21 ప్లాట్లు కొనుగోలు జరిపినా అందులో 13 మంది మాత్రమే పూర్తి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్లాట్ల అమ్మకం ద్వారా సుడా కు కోటి రూపాయల వరకు ఆదాయం లభించింది.
11 న మూడోసారి ఓపెన్ యాక్షన్
సుడా మెగా వెంచర్ లో మిగిలి పోయిన 98 ప్లాట్లకు ఈనెల 11 న మరోసారి ఓపెన్ యాక్షన్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో పాల్గొనే వారు రూ.5000 ధరావత్తు చెల్లించి ప్లాట్ల యాక్షన్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్లాట్ పొందిన వ్యక్తి వెంటనే కొనుగోలు చేసిన ధరలో 25 శాతం చెల్లించి మిగిలిన మొత్తాన్ని నిర్ణీత సమయంలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈసారి ఓపెన్ యాక్షన్ లో పాల్గొనే వారు ధరవత్తు డీడీతో నేరుగా యాక్షన్ లో పాల్గొనే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు.
గజం కనిష్ట ధర తగ్గింపు
సుడా ప్లాట్లు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా అమ్మకాలు జరగకపోవడంతో గజం కనిష్ట ధరలను తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గతంలో కనిష్ట ధర గజానికి రూ.8000గా నిర్ణయించారు. రెండు సార్లు జరిగిన ఓపెన్ యాక్షన్ లో గరిష్టంగా గజానికి రూ. 9000 పలికింది. ఈ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో గతేడాది కాలంగా ప్లాట్ల అమ్మకాలు పెండింగ్ లో పడ్డాయి. దీంతో అధికారులు గజం కనిష్ట ధరను రూ.8 వేల నుంచి రూ.5500 కు తగ్గించారు.
నిలిచిపోయిన అభివృద్ధి పనులు
సుడా మెగా వెంచర్ లో మౌలిక వసతుల కోసం ప్రారంభించిన పనులు సైతం అర్థాంతరంగా నిలిచిపోయాయి. దాదాపు రూ.6.50 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ట్యాంక్, వాటర్ పైప్ లైన్ పనులను ప్రారంభించినా యాభై శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
ఎంట్రెన్స్ లో నాలుగు తారు రోడ్లు పూర్తయినా లోపలి భాగంలో కేవలం భూమిని చదును చేసి వదిలిపెట్టారు. ముందు భాగంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, వాటర్ పైప్ లైన్లు పూర్తి చేసినా లోపలి భాగంలో అసంపూర్తిగానే మిగిలిపోయాయి. కొన్ని చోట్ల డ్రైనేజీ చాంబర్లు ధ్వంసమయ్యాయి. వాటర్ ట్యాంక్, పార్క్ పనులు ఇంకా మొదలుకాలేదు.