ప్లంబర్​ శైలజ ఇన్​స్పిరేషనల్​ జర్నీ..

చదువుకోవాలన్న ఆమె కలకి పెండ్లి ఫుల్​స్టాప్​ పెట్టింది. అన్నీ తానై చూసుకోవాల్సి భర్త నలుగురు ఆడపిల్లలతో ఆమెని ఒంటరిని చేశాడు. పుట్టింటి తలుపులు మూసుకుపోయాయి. అత్తింటివాళ్లు దగ్గరికి తీయలేదు. చుట్టూ ఉన్నవాళ్లు చూస్తుండిపోయారు. ఆ పరిస్థితులే ఆమెని మార్చేశాయి. చీకట్లోనూ వెలుగులా ముందడుగు వేసే ధైర్యాన్నిచ్చాయి. ఫిట్టింగ్ టూల్స్​ చేత పట్టించి ప్లంబర్​ని చేశాయి. దేశంలోనే  ఈ మొదటి లేడీ ప్లంబర్​ పేరు శైలజా అయ్యప్పన్​.  కేరళకి చెందిన ఆమె ఇన్​స్పిరేషనల్​ జర్నీ.. 


కష్టాలే బతికే ధైర్యాన్నిస్తాయి అంటున్న శైలజ కదర్​ గిరిజన తెగకి చెందిన అమ్మాయి.  కేరళలో అటవీ ప్రాంతమైన అతిరప్పిల్లి,  షోలయార్​లో ఉంటోంది. చిన్నప్పట్నించీ పెద్ద చదువులు చదువుకోవాలన్న కోరిక ఉంది శైలజకి. కానీ, కుటుంబ పరిస్థితులు, ఆడపిల్ల బరువు అన్న మాటలు..  కారణం ఏదైతేనేం చదువు మధ్యలోనే పెండ్లి చేశారు తల్లిదండ్రులు. అయినా జీవితంపై ఆశ కోల్పోలేదామె. భర్త సాయంతో ఏదైనా సాధించాలనుకుంది. ఆలోపే మొదటి బిడ్డ పుట్టింది. ఆడపిల్లని కన్నావంటూ పెదవి విరిచారు అత్తింటివాళ్లు. రెండో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టడంతో వారసుడు కావాలంటూ ఒత్తిడి పెంచారు. కానీ, ఆ తర్వాతి రెండు కాన్పుల్లోనూ ఆడపిల్లలే పుట్టడంతో భారం అనుకొని భర్త వదిలేశాడు. నలుగురు ఆడ పిల్లలతో దిక్కుతోచని స్థితిలో చాలా రోజులు మగ్గిపోయింది శైలజ. ఆ కష్టాల నుంచి పుట్టిన ధైర్యంతోనే ఒకరి మీద ఆధారపడకుండా తన పిల్లల్ని తానే పోషించుకోవాలనుకుంది. 

స్వీపర్​గా చేసింది

పెండ్లికి ముందు చదువే శైలజ ప్రపంచం. భర్త తోడుగా ఉన్నంతవరకు బయటికెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి రాలేదు. అయినా సరే పిల్లల కడుపు నింపడానికి కనపడ్డ వాళ్లందర్నీ పని అడిగింది. అందరూ ‘నువ్వు చేయదగ్గ పని మా దగ్గర లేదు’ అన్నారు. చదువుకు తగ్గ పనేదైనా చూసుకుందాం అంటే తను ఉండేది సిటీకి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో. దాంతో పరిస్థితులకి తలవంచి కొన్నాళ్లు స్వీపర్​గా పనిచేసింది. నాలుగు ఇండ్లలో వంట చేసింది. అలా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న టైంలోనే  ‘స్కిల్​ ఇండియా’ ప్రోగ్రాంలో భాగమైన ‘జన్​ శిక్షన్​ సంస్థాన్’​ శైలజ కష్టాన్ని గమనించింది. శైలజతో పాటు మరికొందరిని కలిపి గ్రూప్​గా చేసి, వాళ్లకి నచ్చిన కోర్సులో మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చింది. అయితే శైలజ ఉంటున్న ఏరియాలో ప్లంబర్స్​ కొరత ఎక్కువగా ఉంది. ఆ స్థానాన్ని తను భర్తీ చేస్తే కుటుంబాన్ని పోషించడం తేలిక అవుతుంది అనుకుందామె. కానీ, ఈ జర్నీ తను అనుకున్నంత సులువు కాలేదు.

కోర్సు పూర్తయ్యాక శైలజతో పాటు​ నేర్చుకున్న చాలా మంది ఫీల్డ్​కి వెళ్లడానికి ఇష్టపడలేదు. నలుగురూ ఏమనుకుంటారోనన్న భయంతో ఇంట్లోనే ఉండి పోయారు. కానీ, శైలజ మాత్రం దగ్గర్లోని కాలనీలకి వెళ్లి తన సర్టిఫికెట్​ చూపించింది. పని అడిగింది. చాలామంది ఎగతాళి చేశారు. అయినా వెనక్కి తగ్గలేదు. తవ్వకాల నుంచి పైపుల కటింగ్ వరకు అన్నీ తనే ఒంటరిగా చేసింది. అవన్నీ చూసి ఊరిలో ఏ చిన్న రిపేర్​ ఉన్నా తననే పిలుస్తున్నారు ఇప్పుడు. పెద్ద కాంట్రాక్ట్​లు కూడా వస్తున్నాయి. అయితే కొన్నిసార్లు నేను మహిళ అన్న కారణం వల్లే పనికి పిలుస్తుంటారు కొందరు. అలాంటివి చాలా బాధపెడతాయి అంటోంది శైలజ. మేల్​ డామి నేటింగ్​ సెక్టార్​లో పనిచేస్తుందుకుగాను  విమెన్స్​ డే సందర్భంగా ‘ది మినిస్టరీ ఆఫ్​ స్కిల్​ డెవలప్​మెంట్​ అండ్​ ఎంట్రప్రెనూర్​ షిప్’ ​ శైలజని సత్కరించింది. ‘‘జీవితం సైకిల్​ రైడింగ్ లాంటిది. సైకిల్​పై పట్టు కోల్పోకూడదంటే.. నడుపుతూనే ఉండాలి. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా దాటుకుంటూ ముందుకెళ్లాలి. అలాగే జీవితంలోనూ ముందుకెళ్తూనే ఉండాలి. నేనూ అదే చేశా. ఒంటరిగా నలుగురు పిల్లల్ని చదివించా. నా  ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఇదే పని చేస్తా. మా పెద్దమ్మాయి కూడా నాలాగే ప్లంబర్​’’ అని చెప్పింది శైలజ.  

 

ఇవి కూడా చదవండి

కేర్ తీసుకోకపోతే పిల్లల్లో స్కిన్ ప్రాబ్లమ్స్

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు